- సూర్యాపేట జిల్లాలో రూ.812 కోట్ల బకాయిల వసూలుకు రంగం సిద్ధం
- హైకోర్టు తీర్పుతో అధికారులకు ఊరట.. యాక్షన్‌కు లైన్ క్లియర్!
- 2018 నుంచి 2025 వరకు బకాయి పడ్డ 18 మిల్లుల గుర్తింపు
- మొదట 15 రోజుల నోటీస్.. ఆ తర్వాత ఆస్తుల జప్తు
- పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు
సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వ ధాన్యాన్ని మర ఆడించి బియ్యం ఇవ్వకుండా సంవత్సరాల తరబడి ఎగ్గొడుతున్న డిఫాల్ట్ రైస్ మిల్లుల నుంచి బకాయిలు రాబట్టేందుకు పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేశాయి. సూర్యాపేట జిల్లాలో సీఎంఆర్ బకాయిలు చెల్లించకుండా మొండికేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ ప్రయోగించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇటీవలే దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో, అధికారులకు రికవరీ ప్రక్రియకు పూర్తి లైన్ క్లియర్ అయింది. జిల్లాలో 18 మిల్లుల నుంచి రికవరీ చేయాల్సిన రూ.812 కోట్ల ప్రభుత్వ ధనాన్ని వసూలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
హైకోర్టు తీర్పుతో ‘యాక్ట్’ అమలు స్పీడప్..
గత కొన్నేండ్లుగా ప్రభుత్వ ధాన్యం తీసుకుని బియ్యం అప్పగించని రైస్ మిల్లర్లపై గతంలో అధికారులు చర్యలకు ఉపక్రమించగా, పలువురు మిల్లర్లు కోర్టులను ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అయితే, ప్రజాధనాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పకడ్బందీగా వాదనలు వినిపించడంతో హైకోర్టు ప్రభుత్వ చర్యలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో అధికారులకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేకపోవడంతో ఆర్ఆర్ యాక్ట్ అమలును వేగవంతం చేశారు.
రూ.812 కోట్ల బకాయిలు..
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 2018 నుంచి 2025 వరకు వివిధ సీజన్లకు సంబంధించి ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వకుండా డిఫాల్ట్ అయిన 18 రైస్ మిల్లులను అధికారులు గుర్తించారు. ఈ మిల్లుల నుంచి ప్రభుత్వానికి రూ. 812 కోట్ల విలువైన 3,36,659 మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయిలు ఉన్నట్లు లెక్క తేల్చారు. కొందరు మిల్లర్లు ధాన్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
వీటిలో అత్యధికంగా తిరుమలగిరికి చెందిన సంతోషి మాత రైస్ ఇండ్రస్ట్రీస్ రూ.165కోట్లు, రఘురామ రైస్ ఇండ్రస్ట్రీస్ రూ.120కోట్లు, కోమరబండ శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ రూ.117కోట్లు, గరీడేపల్లికి చెందిన ఎంకేఆర్ రైస్ మిల్లు రూ.82కోట్లు, ఉషశ్విని రైస్ మిల్ రూ.48కోట్లు బకాయిలు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. వీటిలో కొంతమంది కోర్టులను ఆశ్రయించి ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగించకుండా స్టే తెచ్చుకోవడంతో వందల కోట్ల బకాయిలు ఉన్న కూడా ఇప్పటివరకు రికవరీ చేయలేని పరిస్థితి నెలకొంది. వీటితో పాటు ప్రస్తుత సీజన్ సంబంధించి ఇప్పటికే పలుమార్లు మిల్లర్లను హెచ్చరించినా స్పందన లేకపోవడంతో ఇకపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
15 రోజుల నోటీస్.. స్పందించకుంటే సీజ్..
ఆర్ఆర్ యాక్ట్ నిబంధనల ప్రకారం మొదట డిఫాల్ట్ మిల్లర్లకు 15 రోజుల గడువుతో నోటీసులు జారీ చేయనున్నారు. ఈ గడువులోగా బకాయి సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గడువు ముగిసినా బకాయిలు చెల్లించకపోతే, తదుపరి చర్యగా సదరు మిల్లర్లకు సంబంధించిన రైస్ మిల్లులు, గోదాములు, భూములు, స్థిర-చర ఆస్తులను పూర్తిగా జప్తు చేసి, వేలం వేసి ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను రికవరీ చేయనున్నారు.
స్పెషల్ ఆఫీసర్లు..
రెవెన్యూ రికవరీ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా, వేగంగా ఆస్తుల గుర్తింపు, సీజ్ ప్రక్రియ చేపట్టేందుకు కలెక్టర్ ప్రత్యేక అధికారులను నియమించారు. డీఎం సివిల్ సప్లయ్ నోడల్ అధికారిగా డీఎస్ఓ, ఏఎస్ఓ, ఒక తహసీల్దార్ స్థాయీ అధికారితో పాటు ఒక డీటీ స్థాయీ అధికారిని నియమించి డిఫాల్టర్ల ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుత డిఫాల్ట్ మిల్లులతో పాటు త్వరలో భారీగా పెండింగ్ ఉన్న మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టి సీఎంఆర్ ధాన్యం ఉందా.. లేదా నిర్ధారించి, లేకుంటే వాటిపై ఆర్ ఆర్ యాక్ట్ అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆర్ ఆర్ యాక్ట్ అమలు చేశాక మిల్లర్ల నుంచి న్యాయ పరమైన చిక్కులు ఎదురుకాకుండా పక్కా కార్యాచరణతో అధికారులు ముందుకు వెళ్తున్నారు.
పకడ్బందీగా ఆర్ఆర్ యాక్ట్ అమలు చేస్తాం
అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ అమలు చేసి అమలు చేసేందుకు పక్కా ప్రణాళికాతో ముందుకు వెళ్తున్నాం. ఆర్ ఆర్ యాక్ట్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియామిస్తున్నాం. తప్పు చేసింది ఏ స్థాయి మిల్లర్ అయినా చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదు. - తేజస్ నంద్ లాల్ పవార్, కలెక్టర్, సూర్యాపేట
