- 91 రిటైల్ షాప్స్‌పై హెచ్-ఫాస్ట్ దాడులు
- 25.5 టన్నుల నకిలీ నెయ్యి, 10 టన్నుల ముడిసరుకు స్వాధీనం
- రంగు, వాసన కోసం ప్రమాదకర సింథటిక్ కలర్స్, కెమికల్స్ మిక్సింగ్
- గుజరాత్, తమిళనాడు వ్యాపారుల ఆధ్వర్యంలో పక్కా ప్లాన్‌తో దందా
- ‘100% ప్యూర్, ఆర్గానిక్, ఫార్మ్ ఫ్రెష్’ పేర్లతో ఆకర్షణీయమైన బ్రాండెడ్ ప్యాకింగ్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో భారీ నకిలీ నెయ్యి మాఫియా గుట్టును రట్టు చేశారు. పాలు, మీగడ లేకుండానే.. కేవలం పామాయిల్, డాల్డా, గంజి, పిండి, హానికర సింథెటిక్ కలర్స్‌తో కృత్రిమ నెయ్యిని తయారు చేస్తున్న కేంద్రాలపై ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్ (హెచ్-ఫాస్ట్) పోలీసులు దాడులు నిర్వహించారు. కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి సహా సిటీ శివార్లలోని 39 నెయ్యి తయారీ కేంద్రాలు, 91 రిటైల్ ఔట్‌లెట్స్‌పై దాడులు చేశారు. 25.5 టన్నుల నకిలీ నెయ్యి, 10 టన్నుల ముడిసరకును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో జాయింట్ సీపీలు విజయ్ కుమార్, తఫ్సీర్ ఇక్బాల్ సహా హెచ్‌ఫాస్ట్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో కలిసి హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
గుజరాత్, తమిళనాడు వ్యాపారులు..
గుజరాత్, తమిళనాడుకు చెందిన పలువురు వ్యాపారులు కొన్నేండ్లుగా హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని నెయ్యితోపాటు పామాయిల్, ఫుడ్ కలర్స్ హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నారు. తమ ఉత్పత్తులను బేగంబజార్, మలక్‌పేట్ గంజ్, సికింద్రాబాద్ సహా సిటీలోని అన్ని హోల్‌సేల్ మార్కెట్లు, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటకకు సప్లయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హోల్‌సేల్ వ్యాపారులంతా కలిసి నకిలీ నెయ్యి తయారీకి పథకం రచించారు. పాలు లేకుండానే నెయ్యి తయారు చేసేందుకు సిటీ శివారు ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేశారు. నెయ్యి తయారీకి అవసరమైన పాల మీగడను మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
చిక్కదనానికి గంజి, పిండి.. వాసనకు కెమికల్స్..
ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు తరలించిన నాసిరకం మీగడకు పామాయిల్, వనస్పతి(డాల్డా), మిల్క్ పౌడర్ కలుపుతున్నారు. చిక్కదనం కోసం గంజి, పిండి, రవ్వ వాడుతున్నారు. కలర్, ఫ్లేవర్ కోసం శరీరానికి హాని కలిగించే కెమికల్స్ మిక్స్ చేస్తున్నారు. ఇలా తయారు చేసిన నకిలీ నెయ్యిని 100 శాతం స్వచ్ఛమైన నెయ్యి పేరిట ప్యాకింగ్ చేసి రిటైల్ షాపులకు సప్లయ్ చేస్తున్నారు.
హోటల్స్, టిఫిన్ సెంటర్లు, స్వీట్ షాపులకు సప్లయ్..
ఈ కల్తీ నెయ్యిని హోటల్స్, టిఫిన్ సెంటర్లు, స్వీట్ షాపులు, ఆయుర్వేద దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. పూజల కోసం వాడే నెయ్యిని విడిగా ప్యాక్ చేసిన బాటిళ్లలో మార్కెట్‌కు తరలిస్తున్నారు. వాస్తవానికి స్వచ్ఛమైన నెయ్యి మార్కెట్‌లో రూ. వెయ్యి నుంచి 1,500 వరకు పలుకుతుండగా, నకిలీ నెయ్యి 50 శాతం తక్కువ ధరలకు లభిస్తోంది. లాభాల యావలో హోటళ్లు, టిఫిన్‌సెంటర్లు, స్వీట్‌షాపులు కూడా ఈ నెయ్యిని వినియోగిస్తున్నారు. అధునాతన సాంకేతికతతో పరీక్షలు చేసినప్పటికీ గుర్తించలేని విధంగా నకిలీ నెయ్యి తయారు చేస్తున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ ప్యాకెట్లపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనల ప్రకారం బ్యాచ్ నంబర్, లైసెన్స్ వివరాలు, తయారీ తేదీతో పాటు ఎక్స్‌పైరీ, క్వాలిటీ సర్టిఫికేట్ వంటి వివరాలు ఉండడం లేదని ఆయన వివరించారు.
