- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ
- ఐఎన్టీయూసీ బృందంతో భేటీ
గోదావరిఖని, వెలుగు: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, హామీల అమలు కోసం త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. బుధవారం ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, మినిమమ్ వేజ్అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి.జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో యూనియన్ బృందం మంగళవారం హైదరాబాద్‌లోని డిప్యూటీ సీఎం నివాసంలో కలిసి సింగరేణి కార్మికుల సమస్యలను వివరించారు.
సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల మనుగడ కోసం కొత్త బొగ్గు గనుల ప్రారంభం, మెడికల్ బోర్డు, మారుపేర్ల మార్పు సమస్య, పెర్స్క్పై ఇన్‌కమ్ ట్యాక్స్ మాఫీ, సొంత ఇల్లు, సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా తదితర అంశాలను డిప్యూటీ సీఎంకు వివరించారు. కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని లీడర్లు కోరారు. సానుకూలంగా స్పందించిన భట్టి విక్రమార్క సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వీలైనంత త్వరగా యూనియన్ ప్రతినిధులు, సింగరేణి యాజమాన్యం, సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, ఒక్కొక్క సమస్యను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ఎస్.నరసింహ రెడ్డి, ధర్మపురి, త్యాగరాజన్, కాంపెల్లి సమ్మయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ వడ్డేపల్లి దాస్ పాల్గొన్నారు.
