అంబానీ మైండ్ గేమ్: ప్రైమ్ మెంబర్‌షిప్ రీలాంఛ్.. జియో రీఛార్జ్ ప్లాన్స్ పెంపు నుంచి రక్షణ!

అంబానీ మైండ్ గేమ్: ప్రైమ్ మెంబర్‌షిప్ రీలాంఛ్.. జియో రీఛార్జ్ ప్లాన్స్ పెంపు నుంచి రక్షణ!

టెలికాం రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న రిలయన్స్ జియో తన ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు మరో భారీ మాస్టర్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఒకప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన 'జియో ప్రైమ్' మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఇప్పుడు సరికొత్త హంగులతో మళ్లీ రీలాంచ్ చేశారు ముఖేష్ అంబానీ. సుమారు 50 కోట్ల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్న జియో.. ఈ కొత్త మాస్టర్ ప్లాన్ ద్వారా కస్టమర్లను తమ నెట్‌వర్క్ వీడకుండా కట్టిపడేసే భారీ వ్యూహానికి తెరతీసింది.

ఈ రీలాంఛ్ చేసిన జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌లో అత్యంత కీలకమైన ఆకర్షణ 'వన్-ఇయర్ ప్రైస్ గ్యారెంటీ'. టెలికాం ఆపరేటర్లు ఎప్పుడైనా టారిఫ్ ధరలను పెంచే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రైమ్ మెంబర్లకు మాత్రం సెప్టెంబర్ 5, 2027 వరకు ఎలాంటి ధరల పెరుగుదల వర్తించదు. సభ్యులు తమకు నచ్చిన అర్హత గల రీఛార్జ్ ప్యాక్‌లను పాత ధరలకే పొందవచ్చు. భవిష్యత్తులో టారిఫ్స్ పెరిగినా జియో ప్రైమ్ యూజర్లపై ఎలాంటి భారం పడకుండా ఈ మాస్టర్ ప్లాన్ రక్షణ కల్పిస్తుంది. ప్రైమ్ మెంబర్‌షిప్‌ కోసం ఒక్కో సిమ్ కార్డ్ యూజర్ నుంచి రూ.300 వన్‌టైం ఫీజును వసూలు చేస్తోంది జియో.

కేవలం రీఛార్జ్ ప్లాన్ ధరల నుంచి రక్షణే కాకుండా.. జియో ప్రైమ్ సభ్యులకు కంపెనీ అనేక అదనపు కానుకలను ప్రకటిస్తోంది:

1. క్యాష్‌బ్యాక్: జియోపీసీ, జియోహోమ్ సెటప్ చేసుకునే వారికి రూ.300. అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం కొత్త జియో సిమ్ కొనుగోలు చేస్తే మరో రూ.300 చొప్పున మొత్తం రూ.600 వరకు క్యాష్‌బ్యాక్ ఓచర్లను ప్రకటించింది.

2. ఎక్స్‌క్లూజివ్ యాక్సెస్: జియో కొత్త డిజిటల్ సేవలు డివైజెస్‌ను మార్కెట్లోకి వదలడానికి ముందే ప్రైమ్ మెంబర్లు పరీక్షించవచ్చు. బీటా-టెస్టింగ్ ప్రోగ్రామ్‌లలో భాగం కావడానికి అవకాశం ఉంటుంది.

3. కస్టమర్ కేర్: మెంబర్లకు మరింత వేగవంతమైన సేవలు అందించే ప్రత్యేక కేర్ ఛానెల్ సపోర్ట్ లభిస్తుంది.

జియోలో చేరడం ఎలా?
ఇతర టెలికాం ఆపరేటర్లను వాడుతున్న యూజర్లు కూడా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా లేదా కొత్త జియో సిమ్ తీసుకోవడం ద్వారా ఈ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొందవచ్చు. జియో అధికారిక వెబ్‌సైట్, MyJio యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఫిజికల్ జియో స్టోర్స్, ఆథరైజ్డ్ రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా కూడా నమోదు చేసుకోవడానికి వీలుంది. మార్కెట్లో తన వాటాను మరింత పెంచుకోవడానికి జియో వేస్తున్న ఈ పక్కా వ్యూహాత్మక అడుగు టెలికాం రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

►ALSO READ | BSNL 5G వచ్చేస్తోంది.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సేవలు.. కస్టమర్లకు పండగే ..

రేట్ల పెంపు నుంచి రక్షణ కోసం రూ.300 పెట్టి ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవటం కంటే ఏడాది కాలానికి రీఛార్జ్ చేయించుకోవటం బెటర్ అంటూ నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. ఏడాదికి చేయించుకుంటే డిస్కౌంట్ కూడా వస్తుంది రూ.300 అనవసరంగా ఖర్చు చేయటం దేనికని అభిప్రాయపడుతున్నారు.