ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: నకిలీ పత్రాలతో ఆదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఓ మహిళకు ఆరు ప్లాట్లను అమ్మి రూ.42 లక్షల కాజేసిన ఐదుగురిపై కేసు నమోదు చేసి, ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు మావల ఎస్ హెచ్‌వో బీడీ ప్రేమ్‌కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన టోకల బుచన్న, బొల్లి రాజు అలియాస్ రాజన్న, బాలే నర్సింలు, ఏనుగు నవీన్ కుమార్, రాంపూర్ గ్రామానికి చెందిన ఎల్టి లక్ష్మణ్ రెడ్డి అలియాస్ లచ్చారెడ్డి కలిసి నకిలీ పేపర్లు, ఫోర్జరీ సంతకాలతో బట్టి సావర్గాం గ్రామ పరిధిలో ప్లాట్లు ఉన్నట్లు చూపించి బి పుష్పలత అనే మహిళకు అమ్మారు.
2021 ఆగస్టు 9న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా ప్లాట్లు కొనుగోలు చేసిన అనంతరం బాధితురాలు హద్దులు ఏర్పాటు చేసేందుకు వెళ్లగా, ఆ ప్లాట్లు వేరే వారివని స్థానికులు చెప్పారు. దీంతో తహసీల్దార్ ఆఫీస్‌లో రికార్డులు పరిశీలించగా, సంబంధిత భూమిపై విక్రయదారుల పేర్లు లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, ఏనుగు నవీన్ కుమార్, బాలే నర్సింలు పరారీలో ఉన్నట్లు ఎస్ హెచ్‌వో తెలిపారు.
