ఉద్యాన పరిశోధనలు రైతుల చెంతకు చేరాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఉద్యాన పరిశోధనలు రైతుల చెంతకు చేరాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • రాష్ట్రంలో ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌పామ్ సాగును పెంచాలి: మంత్రి తుమ్మల 
  • రాజేంద్రనగర్‌‌‌‌లో హార్టికల్చరల్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌కు శంకుస్థాపన

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: చిన్న, సన్నకారు రైతులే లక్ష్యంగా ఉద్యాన పరిశోధనలు జరగాలని, తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతికతను వేగంగా రైతుల చెంతకు చేర్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మంగళవారం రాజేంద్రనగర్‌‌‌‌లోని హార్టికల్చర్ కాలేజీ ప్రాంగణంలో రూ.10 కోట్ల వ్యయంతో 52 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న హార్టికల్చరల్ రీసెర్చ్ కాంప్లెక్స్‌‌‌‌కు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌‌‌‌ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర సాగు భూమిలో ఉద్యాన పంటల విస్తీర్ణం 6 శాతమే ఉన్నప్పటికీ, వ్యవసాయ స్థూల విలువలో దీని వాటా 26 శాతంగా (రూ.30,346 కోట్లు) ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తిలో సుమారు 70 శాతం లోటు ఉందని, ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో డెమాన్‌‌‌‌స్ట్రేషన్ ప్లాట్లు ఏర్పాటు చేయాలన్నారు.

వర్సిటీలు, పరిశోధనా సంస్థలు హైదరాబాద్‌‌‌‌కే పరిమితం కాకుండా జిల్లాల్లోనూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించడం, డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సాగు విధానాలను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. వచ్చే 3, 4 ఏళ్లలో రాష్ట్రంలో ఆయిల్‌‌‌‌పామ్ సాగును 10 లక్షల ఎకరాలకు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, హార్టికల్చర్ డైరెక్టర్ షేక్ యాష్మిన్ భాషా, వర్సిటీ వీసీ డాక్టర్ దండా రాజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.