జనగామ జిల్లాకుసర్వాయి పాపన్నపేరు పెట్టాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ 

జనగామ జిల్లాకుసర్వాయి పాపన్నపేరు పెట్టాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: జనగామ జిల్లాకు బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును పెట్టాలని బీజేపీ స్టేట్​ చీఫ్​ రాంచందర్ రావు డిమాండ్ చేశారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తకపోవడం విచారకరమన్నారు. మంగళవారం పార్టీ స్టేట్ ఆఫీసులో సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి నిర్వహించారు. రాంచందర్ రావు మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన ధీరుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు.

సామాన్య కుటుంబం నుంచి వచ్చి, మొఘల్ ఆధిపత్యాన్ని గడగడలాడించి గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన ఆయన చరిత్ర మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పాపన్న గౌడ్ పేరును జిల్లాకు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. వందే మాతరం గేయం విషయంలోనూ కాంగ్రెస్ అవమానకరంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన పాపన్న గౌడ్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు.