జూబ్లీహిల్స్‌‌‌‌ సొసైటీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌‌‌‌సిగ్నల్‌‌‌‌

జూబ్లీహిల్స్‌‌‌‌ సొసైటీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌‌‌‌సిగ్నల్‌‌‌‌
  •   8 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  జూబ్లీహిల్స్‌‌‌‌ కోఆపరేటివ్‌‌‌‌ హౌస్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ సొసైటీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి18 నాటి నోటిఫికేషన్‌‌‌‌ ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని  ఆదేశించింది. తీర్పు కాపీ అందినప్పటి నుంచి ఎనిమిది వారాల్లోగా మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కమిటీకి స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాపై అభ్యంతరాల నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌ అమలును నిలిపివేస్తూ సింగిల్‌‌‌‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. 

గతంలో సింగిల్‌‌‌‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై సొసైటీ దాఖలు చేసిన అప్పీళ్లను చీఫ్ జస్టిస్‌‌‌‌ అపరేశ్‌‌‌‌కుమార్‌‌‌‌ సింగ్‌‌‌‌, జస్టిస్‌‌‌‌  మొహియుద్దీన్‌‌‌‌లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది. ఎన్నికల నిర్వహణలో భాగంగా 2024లో సభ్యత్వం పొందిన 270 మందికి ప్రత్యేకంగా ఓటింగ్‌‌‌‌ చేపట్టాలని, ఆ పోలింగ్‌‌‌‌కు సంబంధించిన బ్యాలెట్‌‌‌‌ బాక్సులను భద్రపరచాలని ఆదేశించింది. తుది ఓటర్ల జాబితాలో ఉన్న మిగతా సభ్యుల ఓట్లను కూడా ప్రత్యేకంగా భద్రపరిచి, అనంతరం నిబంధనల మేరకు ఫలితాలను ప్రకటించాలని సూచించింది. ఫలితాల ప్రకటన తర్వాత ఎవరికైనా అభ్యంతరాలుంటే ఎన్నికల పిటిషన్‌‌‌‌ ద్వారా పరిష్కారం కోరవచ్చని తెలిపింది.