హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బదిలీపై ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నప్పటికీ వారి పిల్లలకు ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానిక కోటా వర్తింపజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ, ఆలిండియా సర్వీసు ఉద్యోగుల పిల్లలకు ఇలాంటి వెసులుబాటు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రం అవకాశం నిరాకరించడం సముచితం కాదని పేర్కొంది.
ఇందుకు అనుగుణంగా జీవో 150ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సవరణ పూర్తయ్యేలోగా తీర్పును అమలు చేయాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి తండ్రి ఈఎస్‌ఐ కార్పొరేషన్‌లో పనిచేస్తూ తిరుపతికి బదిలీ కావడం, అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చినప్పటికీ నిబంధనల ప్రకారం స్థానిక కోటా వర్తింపజేయకపోవడాన్ని సవాల్ చేస్తూ కె.సంహిత హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.
ప్రవేశ నిబంధనల్లోని రూల్ 3(ఎ)(3)ను సవరించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను కూడా స్థానిక కోటా పరిధిలోకి తీసుకువచ్చేలా జీవో 150లో మార్పులు చేస్తామని అడ్వొకేట్ జనరల్ ఇచ్చిన హామీని డివిజన్ బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రభుత్వ ఉత్తర్వుల రాజ్యాంగబద్ధతపై ప్రత్యేక ఆదేశాలు అవసరం లేదని పేర్కొంది. జీవోలో సవరణ చేసేలోగా తీర్పును అమలు చేయాలని ఆదేశించింది. 2026–27 విద్యాసంవత్సరానికి పిటిషనర్‌ను స్థానిక కోటా కింద పరిగణించి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియలో కౌన్సెలింగ్‌కు అనుమతించాలని కాళోజీ హెల్త్ వర్సిటీకి స్పష్టం చేసింది.
