దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‍బీఐ) క్లరికల్ కేడర్‌లోని జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో 9124 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 9,124.
హైదరాబాద్ పరిధిలో 260 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎస్సీ 41, ఎస్టీ 18, ఓబీసీ 70, ఈడబ్ల్యూఎస్ 26, జనరల్ 105 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఎలిజిబిలిటీ
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సమాన అర్హత కలిగి ఉండాలి.
ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (ఐడీడీ) సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు డిగ్రీ పాసైన తేదీ 2026, డిసెంబర్ 31 లేదా అంతకంటే ముందు ఉండాలి.
డిగ్రీ చివరి సంవత్సరం లేదా సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే, 2026, డిసెంబర్ 31 నాటికి లేదా అంతకంటే ముందు డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణులైనట్లు సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో కనీసం 15 ఏళ్లు సేవ పూర్తిచేసి, ఇండియన్ ఆర్మీ స్పెషల్ సర్టిఫికెట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా నేవీ/ ఎయిర్ ఫోర్స్ సమాన సర్టిఫికెట్ పొందిన పదోతరగతి అర్హత కలిగిన మాజీ సైనికోద్యోగులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి: 2026, ఏప్రిల్ 1వ తేదీ నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్‌మన్ అభ్యర్థులకు ఫీజు ఉండదు. జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 750 చెల్లించాలి.
లాస్ట్ డేట్: ఆగస్టు 31.
సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తేదీ: సెప్టెంబర్ (తాత్కాలికం).
మెయిన్ ఎగ్జామినేషన్: నవంబర్ (తాత్కాలికం).
మరిన్ని వివరాలకు వెబ్సైట్ sbi.bank.in/web/careers/current-openings ను సందర్శించండి.
ఫేజ్-I: పిలిమినరీ ఎగ్జామినేషన్
ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. కంప్యూటర్ బేస్డ్ టెస్టు(సీబీటీ) విధానంలో నిర్వహించే ఎగ్జామినేషన్‌లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు ఇస్తారు. 60 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. సెక్షన్–Iలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు (20 నిమిషాలు), న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు 35 మార్కులకు (20 నిమిషాలు), రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు 35 మార్కులకు అడుగుతారు. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తీసి ప్రతి కేటగిరీలోని ఖాళీల సంఖ్యకు సుమారు 10 రెట్లు ఎక్కువ మంది అభ్యర్థులను మెయిన్ పరీక్షకు షార్ట్‌లిస్ట్ చేస్తారు.
ఫేజ్-II: మెయిన్ ఎగ్జామినేషన్
ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 190 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు. 160 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. సెక్షన్–--Iలో జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు (35 నిమిషాలు), సెక్షన్--–-IIలో జనరల్ ఇంగ్లిష్ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులకు(35 నిమిషాలు), -సెక్షన్–-I-IIలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు (45 నిమిషాలు), సెక్షన్–-IVలో రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు 60 మార్కులకు (45 నిమిషాలు) అడుగుతారు. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు.
మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్కులు: మెయిన్ పరీక్షలో బ్యాంక్ నిర్ణయించిన కనీస అర్హత శాతాన్ని అభ్యర్థులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యుబీడీ, ఎక్స్-సర్వీస్‌మన్ అభ్యర్థులకు ఈ అర్హత మార్కుల్లో 5 శాతం సడలింపు లభిస్తుంది.
ఫైనల్ మెరిట్ లిస్ట్: తుది ఎంపిక పూర్తిగా మెయిన్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే జరుగుతుంది.
లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (ఎల్ఎల్పీటీ)
అభ్యర్థులు ఏ రాష్ట్రం నుంచి దరఖాస్తు చేసుకున్నారో, ఆ రాష్ట్ర స్థానిక భాషను పదోతరగతి లేదా12వ తరగతిలో ఒక సబ్జెక్టుగా చదివి ఉన్నట్లయితే వారికి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (ఎల్ఎల్పీటీ) నుంచి మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ పదో తరగతి లేదా 12వ తరగతిలో ఆ స్థానిక భాషను సబ్జెక్టుగా చదవని అభ్యర్థులు తాత్కాలికంగా ఎంపికైతే ప్రత్యేకంగా భాషా నైపుణ్య పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. ఒకవేళ భాషా నైపుణ్య పరీక్షలో అర్హత సాధించకపోతే అభ్యర్థుల ఎంపిక రద్దవుతుంది.
ప్రిపరేషన్ టెక్నిక్స్
ఏ పరీక్ష అయినా ముందుగా సిలబస్‌ను పూర్తిగా అవగాహన చేసుకోవాలి. సబ్జెక్ట్ వైజ్‍గా చాప్టర్లు, వాటిలో తరచుగా అడిగే మోడల్స్ వంటి వాటిని రాసుకోవాలి. ముఖ్యంగా ఒక టైం టేబుల్ తయారు చేసుకుని, రోజువారీ లక్ష్యాలు సాధించగలిగితే పరీక్ష ముందు రివిజన్ సులువవుతుంది. మొదటి ప్రిపరేషన్‍లో అన్ని సబ్జెక్టులకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి. సెక్షనల్ కటాఫ్ తీసేయడం ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు లాభిస్తుంది. కాబట్టి ముందుగా పట్టున్న సబ్జెక్టులను క్షుణ్నంగా చదవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ప్రత్యేకంగా కాకుండా రెండు పరీక్షల కలిపి చదువుకోవాలి.
అలాగే పీవో, క్లర్క్ పరీక్షల సిలబస్ ఒకటే కానీ ప్రశ్నల స్టాండర్డ్ వేరుగా ఉంటుంది. క్లర్క్ పరీక్షలో బేసిక్ నుంచి యావరేజ్ మోడల్స్ ఇస్తుండగా పీవో పరీక్షలో టాప్/ అడ్వాన్స్‌డ్ మోడల్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎస్‍బీఐ పరీక్షల్లో పేరాగ్రాఫ్‌లు కానీ, సూచనలు కానీ చాలా పొడవుగా ఉంటాయి కాబట్టి ప్రీవియస్, మోడల్ పేపర్లలోనే వాటిని వేగంగా చదవడం అలవాటు చేసుకోవాలి. సమాధానాలు గుర్తించడానికి ఎక్కువ సమయం తీసుకునే మ్యాథ్స్, రీజనింగ్ సెక్షన్‍లకు ఎక్కువ సమయం కేటాయించి ప్రాక్టీస్ చేయాలి.
ఎక్కువ మార్కులు పొందడానికి వీలయ్యే సబ్జెక్టు కాబట్టి ఇంగ్లిష్‌ను ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకూడదు. వార్తాపత్రికలు ఎక్కువగా చదవడం వల్ల జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్‌పై నాలెడ్జ్ పెరుగుతుంది. బ్యాంకు పరీక్షల్లో ప్రీవియస్ పేపర్లు కీలక పాత్ర పోషిస్తాయి. కొత్తగా రూపొందించే ప్రశ్నపత్రం కూడా 10 నుంచి 20 శాతం మినహాయించి దాదాపు ప్రీవియస్ పేపర్‌కు సమాన స్థాయి, సరళిని కలిగి ఉంటుంది. కాబట్టి మూడు లేదా నాలుగు సంవత్సరాల పేపర్లు సాధన చేయడం అవసరం.
