ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం నగరంలోని ప్రకాష్‌నగర్ కుమ్మరి బజార్లో సంపులో పడి నాలుగేళ్ల బాలుడు చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కుమ్మరి బజార్ కు చెందిన సురేశ్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటుండగా, ఆ ఇంటి పక్కనే సోమారపు ఉమారాణి, సాయి దంపతులు ఉంటున్నారు. ఆదివారం వారు ఇంట్లో ఉండగా, నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి వెళ్లిన వారి కొడుకు గగన్ ఉదయ్(4) కాలుజారి సంపులో పడిపోయాడు.
బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతకగా, సంపులో బాలుడు కనిపించాడు. ఉదయ్‌ను బయటకు తీసి ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. సంపుపై మూత వేసుకోమని చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు వాపోయారు. ఈ మేరకు ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
