న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల తయారీలో కీలకమైన లిథోగ్రఫీ యంత్రాలను సరఫరా చేసే జపాన్ కంపెనీ కెనాన్, భారత చిప్ రంగానికి సహకరించేందుకు సిద్ధమవుతోంది. దేశంలోని కీలక ప్రాజెక్టులతో చర్చలు జరిపినట్లు కెనాన్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ తోషియాకి నోమురా తెలిపారు. భారత్‌లో చిప్ తయారీకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడాన్ని కెనాన్ గొప్ప అవకాశంగా చూస్తోందన్నారు.
చిప్ తయారీదారులకు టెక్నాలజీ సపోర్ట్ అందించేందుకు తమ అడ్వాన్స్డ్ లిథోగ్రఫీ మెషీన్లు, సర్వీస్ సెంటర్లను దేశంలోకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే భారత్ చిప్ తయారీ కేంద్రంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద టాటా ఎలక్ట్రానిక్స్ (ధొలేరా), మైక్రాన్ (సనంద్) సహా దాదాపు 12 ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి. వీటికి తోడుగా కెనాన్ తన సాంప్రదాయ కెమెరాలు, ప్రింటర్లతో పాటు వైద్య పరికరాల విభాగాల్లోనూ భారత్‌లో భారీ వృద్ధి సాధిస్తోంది.
