- రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలు ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: విద్యార్థులు కేవలం క్లాస్ రూమ్ పాఠాలకే పరిమితం కాకుండా, సమాజంలోని సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు చూపేలా పరిశోధనలపై దృష్టి సారించాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన సూచించారు. డిగ్రీ స్థాయి నుంచే పరిశోధనా దృక్పథాన్ని అలవర్చుకుంటే విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత పెరుగుతాయని ఆమె తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన జిజ్ఞాస-–2026 రాష్ట్రస్థాయి స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజ జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి విద్యార్థులు తమ జ్ఞానాన్ని అప్లై చేయాలని, సామాజిక బాధ్యతతో కూడిన ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. కాగా, మూడ్రోజుల పాటు జరిగే ఈ జిజ్ఞాస పోటీల్లో రాష్ట్రంలోని 152 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు చెందిన విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ నెల 18 నుంచి 20 వరకు మూడ్రోజుల పాటు మొత్తం16 సబ్జెక్టులలో ప్రదర్శనలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్లు ప్రొఫెసర్ రాజేంద్ర కుమార్, ప్రొఫెసర్ పి. బాలభాస్కర్, ఏజీఓ ప్రొఫెసర్ వి. రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
