ఏపీ లోకల్ బాడీల్లో బీసీల రిజర్వేషన్లు పెంపు..రూరల్ లో 34 శాతం, పట్టణాల్లో 33.33 శాతం

ఏపీ లోకల్ బాడీల్లో బీసీల రిజర్వేషన్లు పెంపు..రూరల్ లో 34 శాతం, పట్టణాల్లో 33.33 శాతం
  • మేయర్, మున్సిపల్​ చైర్మన్లకు ఇక ప్రత్యక్ష ఎన్నికలు
  • కేబినెట్​ నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్​లో లోకల్​ బాడీల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైన కేబినెట్​లో రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయమే ఎజెండాగా పని చేస్తోందని ఆయన చెప్పారు.

నిబంధనలకు, పరిమితులకు లోబడి బీసీల రిజర్వేషన్లు పెంచామని, గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. 1995 నుంచి 2013 వరకు 34 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, గత ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు 24 శాతానికి కుదించిందని అన్నారు. కేబినెట్​ నిర్ణయాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 

పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలు..

సుస్థిరమైన పాలన అందించేందుకు పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష విధానంలో నిర్వహించాలని కూడా కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నట్టు చంద్రబాబు చెప్పారు. జిల్లాల సంఖ్య పెరిగినా ప్రస్తుతం 13 జిల్లా ప్రజా పరిషత్‌‌‌‌లే ఉన్నాయని, కొత్త జిల్లాలను కలుపుకుని 28 జిల్లా ప్రజా పరిషత్‌‌‌‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

16వ ఆర్థిక సంఘం నిధులు రావాలంటే స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిఉందన్నారు. బీసీ రిజర్వేషన్లపై కేసులు వేయాలని వైసీపీ భావిస్తోందని, ఎవరు కేసులు వేస్తే వారే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.