ఉరికి బదులు ఇంజెక్షన్‌‌‌‌కు సుప్రీం నో..మరణశిక్ష అమలుకు ఉరి విధానమే కొనసాగుతుందని వెల్లడి

ఉరికి బదులు ఇంజెక్షన్‌‌‌‌కు సుప్రీం నో..మరణశిక్ష అమలుకు ఉరి విధానమే కొనసాగుతుందని వెల్లడి
  •     నొప్పి తెల్వకుండా చంపే ఇతర పద్ధతులు పాటించాలన్న అప్పీల్‌‌‌‌ కొట్టివేత

న్యూఢిల్లీ: ఖైదీలకు మరణ శిక్ష అమలులో ఉరి వేయడానికి బదులు ప్రాణాంతకమైన ఇంజెక్షన్‌‌‌‌ను వినియోగించాలని చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం దేశంలో మరణశిక్ష అమలుకు ఉరి విధానమే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఉరికి బదులుగా తక్కువ బాధ కలిగించే ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రవేశపెట్టాలంటూ లాయర్‌‌‌‌‌‌‌‌ రిషి మల్హోత్రా పిటిషన్‌‌‌‌ వేశారు. దీనిపై మంగళవారం విచారించిన జస్టిస్‌‌‌‌ విక్రమ్‌‌‌‌నాథ్‌‌‌‌, జస్టిస్‌‌‌‌ సందీప్‌‌‌‌ మెహతాతో కూడిన ధర్మాసనం పిటిషన్‌‌‌‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

సైంటిఫిక్‌‌‌‌ ఆధారాలుంటే చూద్దాం

ఉరి శిక్ష రాజ్యాంగబద్ధతను సవాల్‌‌‌‌ చేస్తూ, ప్రాణాంతక ఇంజెక్షన్‌‌‌‌, తుపాకీతో కాల్చడం, కరెంట్‌‌‌‌షాక్‌‌‌‌, గ్యాస్‌‌‌‌ ఛాంబర్‌‌‌‌ వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని రిషి మల్హోత్రా పిటిషన్‌‌‌‌లో పేర్కొన్నారు. ఉరి ద్వారా మరణం అత్యంత బాధాకరమైనదని, అమానవీయమైనదని తెలిపారు. సీఆర్‌‌‌‌పీసీలోని సెక్షన్‌‌‌‌ 354(5) ప్రకారం ఉరి ద్వారా మరణశిక్ష అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. గౌరవప్రదమైన మరణాన్ని పొందడం.. ఆర్టికల్‌‌‌‌ 21 కింద ప్రాథమిక హక్కుగా గుర్తించాలని కోరారు. ఉరి తర్వాత మరణాన్ని నిర్ధారించడానికి 40 నిమిషాలు పడుతుండగా.. ప్రాణాంతక ఇంజెక్షన్‌‌‌‌ లేదా ఇతర పద్ధతుల్లో 5 నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతుందని పిటిషన్‌‌‌‌లో పేర్కొన్నారు. 

పిటిషనర్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థనను పరిశీలించిన కోర్టు..  ప్రత్యామ్నాయ మరణశిక్ష విధానాలపై భవిష్యత్తులో సమీక్షకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుత విధానంకంటే ఇతర మార్గాలు బెటర్‌‌‌‌‌‌‌‌ అని వైద్య లేదా సైంటిఫిక్‌‌‌‌ ఆధారాలతో వస్తే ఈ అంశాన్ని మరోసారి పరిశీలిద్దామంది. ప్రత్యామ్నాయ పద్ధతులపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది. గత విచారణ సందర్భాల్లో సైతం ఉరి విధానం అమలుకే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపిందని బెంచ్‌‌‌‌ గుర్తుచేసింది.