అంగన్వాడీల్లో బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు?.. ఆసిఫాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో ఆగిన తొలిముద్ద

 అంగన్వాడీల్లో  బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు?.. ఆసిఫాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో ఆగిన  తొలిముద్ద
  • ఆసిఫాబాద్​, కొత్తగూడెం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌  దగ్గరే ఆగిన ‘తొలిముద్ద’
  • గత మార్చిలో సీఎం చేతుల మీదుగా స్కీమ్ ప్రారంభం 
  • ఈ అకడమిక్  ఇయర్  నుంచే అమలు చేస్తామని ప్రకటన
  • 31 జిల్లాల్లోని 7.87 లక్షల మంది చిన్నారుల నిరీక్షణ

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలోని అంగన్ వాడీ సెంటర్లలో చదివే చిన్నారుల ఉదయపు ఆకలిని తీర్చి, పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘తొలిముద్ద’ (బ్రేక్‌‌‌‌ఫాస్ట్) స్కీమ్  పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. గత జూన్  నెలలో రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా ఈ స్కీమ్ ను ప్రారంభించారు. పైలెట్  ప్రాజెక్ట్  ప్రారంభమై రెండు నెలలు దాటినప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం లేదు. 

మార్చి 28న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కతో కలిసి అసెంబ్లీ ప్రాంగణంలో తొలిముద్ద స్కీమ్ ను ప్రారంభించారు. ఆగస్టు నుంచి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,781 అంగన్​వాడీ సెంటర్లలో 3 నుంచి 6 ఏండ్ల వయసున్న 7,87,603 మంది చిన్నారులకు అల్పాహారం అందిస్తామని గత నెలలో మంత్రి సీతక్క ప్రకటించారు. అయితే.. ఈ స్కీమ్  కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వరకే పరిమితమైంది. స్కూల్  ఎడ్యుకేషన్  పరిధిలో బ్రేక్‌‌  ‌‌ఫాస్ట్  స్కీమ్  నడుస్తున్నప్పటికీ, అంగన్​వాడీ సెంటర్లలో ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతోంది.

8 లక్షల మంది ఎదురుచూపు.. 

చిన్నారుల్లో ఉదయపు ఆకలి తీర్చి, వారి మానసిక, శారీరక ఎదుగుదలకు తోడ్పడేలా తెలంగాణ ఫుడ్స్  సంస్థ ద్వారా ఈ అల్పాహారాన్ని రూపొందించారు. నేషనల్  ఇన్‌‌స్టిట్యూట్  ఆఫ్  న్యూట్రిషన్(ఎన్ఐఎన్), యూనిసెఫ్  టెక్నికల్  సహకారంతో ఎలాంటి ప్రిజర్వేటివ్స్  లేకుండా తయారుచేసిన ఇన్‌‌స్టంట్ ఉప్మా మిక్స్, కిచిడీ మిక్స్‌‌‌‌ను ఈ స్కీమ్  కింద సప్లై చేస్తారు. ఒక్కో చిన్నారికి రోజుకు 25 గ్రాముల చొప్పున ఏడాదిలో 300 రోజుల పాటు అందిస్తారు. 

అంగన్​వాడీ సెంటర్లలో ఇప్పటికే అమలవుతున్న మధ్యాహ్న భోజనం, రోజూ ఉడికించిన గుడ్డు, ఈవెనింగ్  స్నాక్స్‌‌ ‌‌కు అదనంగా ఈ అల్పాహారం అందిస్తారు. కాగా, రాష్ట్రంలోని అంగన్​వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం 3 నుంచి 6 ఏండ్ల చిన్నారులు 7.87 లక్షల మంది ఉన్నారు. బాల భరోసా కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల మంది ఐదేండ్లలోపు పిల్లలను పరిశీలించగా, అనేకమంది చిన్నారుల్లో ఎదుగుదల లోపాలు(స్టంటింగ్, వేస్టింగ్), తీవ్ర పౌష్టికాహార లోపం, రక్తహీనత నమోదయ్యాయి. ఈ స్కీమ్  పూర్తి స్థాయిలో అమలులోకి వస్తే ఈ చిన్నారులకు ఎంతో మేలు జరుగుతుంది.

పైలెట్  ప్రాజెక్ట్  సక్సెస్..

కుమ్రంభీం ఆసీఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో పైలట్  ప్రాజెక్ట్  సక్సెస్  ఫుల్ గా నడుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, అధికారుల నిర్లక్ష్యం, మౌలిక వసతుల లేమి, పెండింగ్  నిధులే ఈ స్కీమ్ ను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఆటంకంగా మారినట్లు చెబుతున్నారు. టీజీ ఫుడ్స్  నుంచి అన్ని ప్రాజెక్టులకు ముడి సరుకును సకాలంలో చేరవేసే లాజిస్టిక్స్  ఇంకా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోనట్లు తెలుస్తోంది. 

అలాగే పెండింగ్  బిల్లులు కూడా ఉండడంతో ముడి సరుకులు సప్లై చేయడానికి వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అంగన్​వాడీ సెంటర్లలో టీచర్, ఆయా పోస్టుల భర్తీ కొనసాగుతుండడం, పలు సెంటర్లలో వంటపాత్రలు, తాగునీటి వంటి కనీస మౌలిక వసతుల కొరత ఉండడం కూడా ఆలస్యానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సమస్యలు  పరిష్కరించి, రాష్ట్రంలోని అన్ని అంగన్​వాడీ కేంద్రాల్లో తొలిముద్ద స్కీమ్  పూర్తి స్థాయిలో అమలు చేయాలని పేరెంట్స్​ 
కోరుతున్నారు.