స్టాక్ మార్కెట్ అంటేనే భయపడే రోజుల్లో.. విద్యార్థి దశలో రూ.15 వేల పెట్టుబడిని పూర్తిగా నష్టపోయిన ఓ యువకుడు.. ప్రస్తుతం విజయవంతమైన ఇన్వెస్టర్‌గా ఎలా ఎదిగాడో తెలుసా? NTO ఫౌండర్ అభిజిత్ రెగే తన జీవితంలో ఎదురైన ఆర్థిక పాఠాల ద్వారా సంపద సృష్టించటాన్ని ఎలా నేర్చుకున్నారో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
సుమారు 2000 సంవత్సరంలో ఐఐఎం లక్నోలోచదువుతున్న రోజుల్లో అభిజిత్ తన స్నేహితులతో కలిసి రూ.15వేలు పోగుచేశారు. మార్కెట్ టిప్స్‌ని నమ్మి ఆ డబ్బును స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టారు. అయితే అదే సమయంలో డాట్-కామ్ బబుల్ కారణంగా మార్కెట్ కుప్పకూలడంతో వారి ఇన్వెస్ట్మెంట్ మెుత్తం ఆవిరిపోయింది. తొలి ప్రయత్నంలోనే భారీగా నష్టపోయినప్పటికీ.. ఆ అనుభవం ఆయనలో పెట్టుబడులపై తీవ్రమైన జిజ్ఞాసను రగిలించింది.
ఒక సంవత్సరం తర్వాత అమెరికాకు వెళ్లిన ఆయన.. వారెన్ బఫెట్, పీటర్ లించ్ వంటి దిగ్గజ ఇన్వెస్టర్ల పెట్టుబడి విధానాలపై లోతుగా అధ్యయనం చేశారు. పుస్తకాలు, రీసెర్చ్ ద్వారా ఇన్వెస్టింగ్ అనేది అదృష్టం మీద ఆధారపడినది కాదని, బలమైన వ్యాపారాలను గుర్తించి దీర్ఘకాలం పాటు ఓపికగా ఉంచే క్రమశిక్షణ అని గ్రహించాడు. మార్కెట్లు చాలా వరకు సమర్థవంతంగా పనిచేసినప్పటికీ.. సరైన రీసెర్చ్ చేసి మంచి అవకాశాలను పట్టుకోవచ్చని నిరూపించారు.
ఈ ఆలోచనలతో సొంత ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించుకున్న ఆయన.. గత రెండు దశాబ్దాలుగా దానిని విజయవంతంగా అమలుచేశారు. నెట్‌ఫ్లిక్స్, గూగుల్, యాపిల్, అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీలలో పెట్టుబడులు పెట్టి అద్భుతమైన రాబడులను అందుకున్నారు. అయితే ఈ ప్రయాణంలో కొన్ని పొరపాట్లు, నష్టాలు కూడా ఎదురయ్యాయని.. కానీ పర్సనల్ స్టాక్ సెలక్షన్ కంటే అనుభవాల ద్వారా నేర్చుకున్న అలవాట్లే ముఖ్యమని ఈ సీఈఓ చెబుతున్నారు.
యువతకు ఆయన ఇస్తున్న ప్రధాన సలహా ఏమిటంటే.. పెట్టుబడులు పెట్టడం అనేది కేవలం నిపుణులకు లేదంటే డబ్బున్నోళ్లకు మాత్రమే పరిమితమైన విద్య కాదు. సరైన జ్ఞానాన్ని సంపాదించి, ఒక నిర్దిష్ట పద్ధతిని పాటిస్తూ.. పెట్టుబడికి తగినంత సమయం కేటాయిస్తే ఎవరైనా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించవచ్చని అభిజిత్ నిరూపించి చూపారు నిజజీవితంలో.
