ఆసియా క్రీడల్లో భారత్‎కు 20వ స్వర్ణం.. ఉత్తర కొరియా రెజ్లర్‌ను చిత్తు చేసిన అమన్ సెహ్రావత్

ఆసియా క్రీడల్లో భారత్‎కు 20వ స్వర్ణం.. ఉత్తర కొరియా రెజ్లర్‌ను చిత్తు చేసిన అమన్ సెహ్రావత్

టోక్యో: 2026 ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. భారత స్టార్ రెజ్లర్, పారిస్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్ గోల్డ్ మెడల్ సాధించాడు. శనివారం (అక్టోబర్ 3) జరిగిన పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్‌లో ఉత్తర కొరియాకు చెందిన వరల్డ్ ఛాంపియన్ హన్ చోంగ్-సంగ్‌ను 11-7 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు. 

2022 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచిన అమన్ ఈసారి మరింత అద్భుతంగా పోరాడి పసిడి పతకం దక్కించుకున్నాడు. తద్వారా ఆసియా క్రీడల పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా అమన్ సెహ్రావత్ చరిత్ర సృష్టించాడు. అలాగే, 2026 ఆసియా క్రీడల్లో భారతదేశానికి 20వ స్వర్ణ పతకాన్ని అందించాడు.

అమన్ సెహ్రావత్ పసిడి పట్టు

జపాన్‌లోని నాగోయా సిటీలోని ఇనే స్పోర్ట్స్ సెంటర్‌లో జరిగిన పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్‌లో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్, ఉత్తర కొరియాకు చెందిన వరల్డ్ ఛాంపియన్ హన్ చోంగ్-సంగ్‌ హోరాహోరీగా తలపడ్డారు. భారత రెజ్లర్ గేమ్ స్టార్టింగ్ నుంచే ఆధిపత్యం ప్రదర్శించాడు. అమన్ 6-3 తేడాతో లీడ్ సాధించాడు. ఈ దశలో కొరియో రెజ్లర్‎గాయపడ్డాడు. 

వైద్యులు పరీక్షించిన అనంతరం హన్ చోంగ్-సంగ్‌ తిరిగి రింగ్‏లోకి అడుగుపెట్టాడు. గాయం తర్వాత కొరియో రెజ్లర్ బలంగా పుంజుకోవడంతో స్కోర్ 7-6గా మారింది. దీంతో ఫైనల్ పోరు ఉత్కంఠభరితంగా మారింది. ఆట చివరి రెండు నిమిషాల్లో అమన్ అద్భుతంగా రాణించి11-7 తేడాతో కొరియోపై విజయం సాధించి గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు.