Rupayanamaha Review: కోటి రూపాయల లాటరీ టికెట్ మిస్సింగ్.. కథలో అసలు ట్విస్ట్ ఇదే!

Rupayanamaha Review: కోటి రూపాయల లాటరీ టికెట్ మిస్సింగ్.. కథలో అసలు ట్విస్ట్ ఇదే!

తెలుగు వెండి తెరపై గ్రామీణ నేపథ్యంతో వచ్చే చిన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. అలా ఎలాంటి భారీ ఆర్భాటాలు లేకుండా, స్వచ్ఛమైన పల్లెటూరి మనుషుల అమాయకత్వం, అక్కడి భావోద్వేగాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘రూపాయనమః’(Rupayanamaha). కొత్త దర్శకుడు అరవింద్ రెడ్డి దర్శకత్వంలో, చిత్ర వేద ప్రొడక్షన్స్ పతాకంపై పావని సాగి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (అక్టోబర్ 2, 2026న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ విలేజ్ కామెడీ మూవీ ప్రేక్షకులను ఏ విధంగా అలరించిందో రివ్యూలో తెలుసుకుందాం.

కథేంటంటే: 

హరి నారాయణ తన కుటుంబంతో కలిసి పల్లెటూరిలో ఎంతో సాదాసీదా జీవితాన్ని గడుపుతుంటాడు. ఆర్థిక సమస్యలు, కుటుంబ పోషణ భారంతో సతమతమవుతున్న అతని జీవితంలోకి అనుకోకుండా ఒక లాటరీ రూపంలో పెద్ద అదృష్టం తలుపు తడుతుంది. అతడు సరదాగా కొన్న ఒక లాటరీ టికెట్‌కు ఏకంగా కోటి రూపాయల భారీ బహుమతి తగులుతుంది. తమ కష్టాలన్నీ తీరిపోయాయని ఆ కుటుంబం ఆనందపడే లోపు ఒక ఊహించని సమస్య ఎదురవుతుంది. అదేమిటంటే.. ఆ కోటి రూపాయల విలువైన లాటరీ టికెట్ ఇంట్లో మాయం కావటమే. ఆ తర్వాత సదరు ఫ్యామిలీ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొందనేదే మిగతా కథ.  

కథలో అసలు ట్విస్ట్ ఇదే!

ఇల్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెతుకుతున్నప్పుడు.. హరికి ఒక గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆ లాటరీ టికెట్ తన దగ్గరే ఉందని, దాన్ని తిరిగి పొందాలంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. అసలు ఆ అపరిచితుడు ఎవరు? ఆ టికెట్ అతనికి ఎలా దొరికింది? 10 లక్షలు డిమాండ్ చేస్తున్న ఆ వ్యక్తిని ఎదుర్కొని హరి తన లాటరీ టికెట్‌ను ఎలా దక్కించుకున్నాడు అనేదే ఈ సినిమాలోని అసలు సిసలు మలుపు.

నటీనటుల ప్రతిభ: 

ఈ చిత్రంలో నటించిన వారంతా కొత్తవారే అయినప్పటికీ.. తెరపై చాలా సహజంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమయ్యే మధ్యతరగతి సామాన్యుడి పాత్రలో అరవింద్ తన అభినయంతో ఆకట్టుకున్నారు. అతనిలోని ఆందోళన, నిస్సహాయత సన్నివేశాలను రక్తికట్టించాయి. ఇక శ్రావణి మల్కాని, వేణు పోల్సాని, డి. అనుదీప్, క్రాక్ శ్రీమణి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించి సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చారు.

టెక్నీకల్ అంశాలు: 

టెక్నికల్ పరంగా చూస్తే.. జింకా వరుణ్ నాయుడు సినిమాటోగ్రఫీ పల్లెటూరి లొకేషన్లను ఎక్కడా కృత్రిమత్వం లేకుండా చాలా వాస్తవికంగా చూపించాడు. రిషి ఎం అందించిన నేపథ్య సంగీతం ఉత్కంఠను, కామెడీ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. అయితే ఫస్ట్ హాఫ్ లో స్టోరీ కొద్దిగా నెమ్మదిగా సాగడం చిన్న మైనస్ అయినప్పటికీ.. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫోన్ కాల్స్, ఎత్తుకు పైఎత్తులతో కూడిన సన్నివేశాలు స్టోరీని పరుగులు పెట్టిస్తాయి. ఆడియెన్స్‌ని ఊహించని ట్విస్టులు కుర్చీలకు కట్టిపడేస్తాయి.

‘రూపాయనమః’ అనేది స్వచ్ఛమైన పల్లెటూరి కామెడీ, ఆసక్తికరమైన థ్రిల్లర్ అంశాల కలయికతో రూపొందిన చక్కటి చిత్రం. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసేలా ఈ సినిమా సాగుతుంది. సహజమైన గ్రామీణ వాతావరణం, వినోదభరితమైన కథాంశం ఇష్టపడేవారికి ఈ చిత్రం మంచి అనుభూతిని పంచుతూ ఫ్యామిలీ మెుత్తం కలిసి చూసేలా ఉంది.