సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యానికి ఒక కొత్త దిశ. భూమి అనేది భారతదేశంలో కేవలం ఒక ఆస్తి మాత్రమే కాదు. అది ఒక కుటుంబానికి జీవనాధారం, తరతరాల వారసత్వం, ఆర్థిక భద్రత, భావోద్వేగ అనుబంధం. అందువల్ల ప్రజలు తమ భూమిని కోల్పోవడానికి సహజంగానే ఇష్టపడరు. మరోవైపు దేశాభివృద్ధి కోసం రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, కాలువలు, డ్యాంలు, రిజర్వాయర్లు, పట్టణ విస్తరణ వంటి అనేక ప్రాజెక్టులకు భూమి అవసరం అవుతుంది.
ప్రస్తుతం అమలులో ఉన్న భూసేకరణ విధానంలో ప్రభుత్వం ప్రజలను ఒప్పించడం, అధిక నష్టపరిహారం చెల్లించడం, కోర్టు కేసులు ఎదుర్కోవడం, రాజకీయ ఒత్తిళ్లు, ప్రాజెక్టుల ఆలస్యం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా నగదు పరిహారం మాత్రమే ఇవ్వడం వల్ల భూమి కోల్పోయిన కుటుంబాలు దీర్ఘకాలంలో ఆర్థికంగా బలహీనపడుతున్న ఉదాహరణలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘డబుల్ అండ్ హాఫ్ మెథడ్’ అనే ప్రత్యామ్నాయ భూసేకరణ విధానం ఒక సమతుల్య పరిష్కారంగా ఉపయోగపడవచ్చు.
ఈ విధానంలో ప్రభుత్వం ప్రాజెక్టుకు అవసరమైన భూమికంటే కొంత ఎక్కువ భూమిని సేకరిస్తుంది. రోడ్లు, రైల్వేలు, మౌలిక వసతుల కోసం అవసరమైన భూమికి సుమారు 2 నుంచి 2.5 రెట్లు భూమిని సేకరించవచ్చు. పారిశ్రామిక, పట్టణాభివృద్ధి, వాణిజ్య, వ్యవసాయ, నీటి పారుదల అవసరాలకు అవసరాన్ని బట్టి 4 నుంచి 5 రెట్లు వరకు భూమిని సేకరించవచ్చు. ప్రాజెక్టుకు అవసరమైన భూమిని వినియోగించిన తర్వాత మిగిలిన భూమిని అభివృద్ధి చేసి, తిరిగి భూమి కోల్పోయినవారికి వాటాలుగా కేటాయించాలి.
ప్రస్తుతం ప్రాజెక్టు కోసం భూమి కోల్పో యిన రైతు లేదా భూయజమాని పూర్తిగా నష్టపోతుంటాడు. అదే సమయంలో ఆ ప్రాజెక్టు వల్ల చుట్టుపక్కల భూముల విలువ అనేక రెట్లు పెరిగి, ఆ భూముల యజమానులు ఎటువంటి త్యాగం చేయకుండానే భారీ లాభం పొందుతున్నారు. అంటే, నష్టం ఒకరికి, లాభం మరొకరికి అనే అసమాన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ విధానం ద్వారా అభివృద్ధి వల్ల కలిగే విలువ పెరుగుదలలో భూమి కోల్పోయినవారికీ వాటా లభిస్తుంది. దీంతో నష్టం, లాభం రెండూ సమాజంలో మరింత సమానంగా పంచడం జరుగుతుంది.
రాజకీయ ప్రభావాన్ని తగ్గించే అవకాశం
కొన్ని సందర్భాల్లో రాజకీయ లేదా ఆర్థిక పలుకుబడి ఉన్న వ్యక్తులు తమ భూములు ప్రభావితం కాకుండా చూసుకుని, రోడ్లు, కాలువలు, ఇతర ప్రాజెక్టులను బలహీనవర్గాల భూముల మీదుగా మళ్లిస్తున్నారనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. దీనివల్ల భూమి కోల్పోయేది పేద రైతులు. అయితే ప్రాజెక్టు వల్ల భూముల విలువ పెరగడం ద్వారా లాభం పొందేది పలుకుబడి ఉన్న వర్గాలు. ఈ విధానం అమలులో ఉంటే ప్రాజెక్టు వల్ల ఏర్పడే అదనపు విలువలో భూమి కోల్పోయినవారికి కూడా వాటా లభిస్తుంది. తద్వారా రాజకీయ ప్రభావం, అన్యాయం, అసమానతలపై వచ్చే విమర్శలు తగ్గే అవకాశం ఉంటుంది.
ఈ విధానం పూర్తిగా పారదర్శకంగా అమలు కావాలి. అదనంగా సేకరించిన భూమిని అభివృద్ధి చేసిన తర్వాత, భూమి కోల్పోయినవారికి వారి అర్హత మేరకు కేటాయించాలి. ఈ కేటాయింపు పూర్తిగా కంప్యూటరైజ్డ్ డ్రా లేదా లాటరీ విధానం ద్వారా జరగాలి. భూముల విస్తీర్ణం, ఆకారం, రోడ్డు సౌకర్యం వంటి అంశాలను ముందుగానే నిర్ణయించి, ఎటువంటి రాజకీయ లేదా అధికార జోక్యానికి అవకాశం లేకుండా కేటాయింపు జరగాలి.
నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రత్యేక విధానం
కాలువలు, డ్యాంలు, రిజర్వాయర్లు, చెరువులు వంటి నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ఈ విధానం మరింత అవసరం. ఎందుకంటే నీటికింద భూములు కోల్పోయిన రైతులు శాశ్వతంగా తమ భూమిని కోల్పోతారు. అయితే ఆ నీటిని ఉపయోగించి సాగు చేసే ఇతర రైతులు దీర్ఘకాలం లాభపడుతుంటారు. అందువల్ల కేవలం నగదు పరిహారం మాత్రమే కాకుండా, కొంత నగదు, కొంత అభివృద్ధి చేసిన భూమి, ఈ రెండింటినీ కలిపి ఇవ్వడం మరింత న్యాయబద్ధమైన విధానం అవుతుంది.
భూమి అనేది తరతరాలకు నిలిచే ఆస్తి. కాబట్టి కేవలం నగదు పరిహారం కాకుండా భూమిలో వాటా కూడా ఇవ్వడం వారి కుటుంబ భవిష్యత్తుకు భరోసాను కల్పిస్తుంది. భూమి అవసరం లేదనుకునేవారికి పూర్తిగా నగదు నష్టపరిహారం ఇవ్వవచ్చు. భూమి కావాలనుకునేవారికి కొంత నగదు, కొంత అభివృద్ధి చేసిన భూమి ఇవ్వవచ్చు. ఇలా ప్రజల నిర్ణయానికే ప్రాధాన్యత ఇవ్వాలి.
ఈ విధానం వల్ల కలిగే ప్రయోజనాలు
భూసేకరణపై ప్రజల వ్యతిరేకత తగ్గుతుంది. కోర్టు వివాదాలు తగ్గుతాయి. ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి. భూమి కోల్పోయినవారికి శాశ్వత ఆర్థిక భద్రత లభిస్తుంది. అభివృద్ధి వల్ల కలిగే లాభంలో వారు కూడా భాగస్వాములు అవుతారు. రాజకీయ ప్రభావం, పక్షపాతం తగ్గుతుంది. సామాజిక న్యాయం బలపడుతుంది. ప్రభుత్వం– ప్రజల మధ్య విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి ఫలాలు మరింత సమానంగా పంపిణీ అవుతాయి. దేశ అభివృద్ధికి భూసేకరణ అనివార్యం. కానీ అభివృద్ధి పేరుతో కొందరు మాత్రమే నష్టపోయి, మరికొందరు మాత్రమే లాభపడే విధానం దీర్ఘకాలంలో సామాజిక అసంతృప్తిని పెంచుతుంది. అందువల్ల భూసేకరణను కేవలం ‘నష్టపరిహారం చెల్లించే ప్రక్రియ’గా కాకుండా, ‘అభివృద్ధి వల్ల ఏర్పడే సంపదలో భూమి కోల్పోయినవారిని భాగ స్వాములను చేసే వ్యవస్థ’గా మార్చాల్సిన అవసరం ఉంది.
‘డబుల్ అండ్ హాఫ్ మెథడ్’ అదే లక్ష్యాన్ని సాధించే ఒక ప్రత్యామ్నాయ విధానం. ఇందులో భూమి కోల్పోయినవారికి మాత్రమే కాకుండా, అభివృద్ధి వల్ల లాభం పొందేవారినీ సమాన బాధ్యతతో భాగస్వాములను చేసి, నష్టం–లాభాలను సమతుల్యం చేయడం ప్రధాన ఉద్దేశ్యం. ఈ విధానం అమలైతే భూసేకరణ సులభమవుతుంది, ప్రజల విశ్వాసం పెరుగుతుంది, ముఖ్యంగా అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు మరింత న్యాయంగా చేరే అవకాశం ఏర్పడుతుంది. ఇది కేవలం ఒక భూసేకరణ విధానం కాదు. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యంతో కూడిన కొత్త అభివృద్ధి తత్వం.
- పి.అన్వేష్‌రెడ్డి
