ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణగల భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికల వ్యవస్థే ఊపిరి. స్వాతంత్య్రం తర్వాత ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు స్వతంత్ర ప్రతిపత్తిగల భారత ఎన్నికల సంఘం పాలకుల చేతిలో కీలుబొమ్మగా మారడంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనే కుట్రలతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత ఎన్నికల సంఘాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తోంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని, ‘సర్’ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఏడాది క్రితమే లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పలు ఆధారాలతో సహా రుజువు చేసినా ఈసీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు ‘సర్’లో లోపాలను ఎత్తిచూపడంతో దీర్ఘకాలికంగా కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్న అనుమానాలు నిజమయ్యాయి.
సర్‌తో దేశవ్యాప్తంగా 13.37 కోట్ల పేర్లు డ్రాఫ్ట్‌లో కనిపించకపోవడంతో ఆందోళన నెలకొంది. ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఉపయోగించే ఫారమ్-6పై పలు సందేహాలున్నాయి. తండ్రి, తాతల పేర్లు, వారి ఓటరు జాబితా అక్కడ పేర్కొనాల్సిరావడంతో గందరగోళం నెలకొంటోంది. ఈ సుదీర్ఘ ప్రక్రియతో విసుగెత్తుతున్న సామాన్యులు ఓటరుగా నమోదు చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.
దేశంలో ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు సవరించడం ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ బాధ్యత. మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, ఒకటి కంటే ఎక్కువచోట్ల నమోదైన పేర్లను గుర్తించి తొలగించడం ఎన్నికల ప్రక్రియలో సాధారణమైన అంశమే. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ దుమారం రేపుతోంది. ఒకసారి చట్టబద్ధంగా ఓటరుగా నమోదై ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత మళ్లీ వారు తమ అర్హతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది.
చిన్నపాటి వ్యత్యాసాలు, పాత జాబితాలతో మ్యాపింగ్ జరగకపోవడం వంటి కారణాలతో అర్హులైనవారి పేర్లు డ్రాఫ్ట్ నుంచి తప్పించడం అన్యాయం. వారికి మళ్లీ నోటీసులిచ్చి నమోదు చేసుకోమని చెప్పడం ప్రజలకు ఇబ్బందికరమే. ఓటర్లను తొలగించకుండా ఎన్నికల సంఘమే ఆ తప్పులను సవరిస్తే సమస్యే ఉండదు.
లోపభూయిష్ఠంగా ఈసీ వ్యవహార శైలి
గోవాలో సర్ ప్రక్రియలో భాగంగా జాబితాలో లోపాలున్నాయనే కారణంతో 97 మందిని తొలుత తొలగించిన తర్వాత విచారణలో వారు అర్హులే అని తేలింది. అయితే తప్పు తెలుసుకున్న ఈసీ వారిని తిరిగి జాబితాలో చేర్చడానికి ప్రయత్నిస్తే సాఫ్ట్‌వేర్‌లో రోల్‌బాక్ సౌకర్యం లేకపోవడంతో సమస్యలొచ్చాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇదే తరహా అనుభవాలున్నా ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
గతంలో బిహార్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో సర్ ప్రక్రియతో ప్రభుత్వాలే మారిపోయాయి. బీజేపీ సూచనల మేరకు అక్కడ ఉద్దేశపూర్వకంగా ఒక సామాజిక వర్గం ఓట్లను తొలగించారనే ఆరోపణలున్నాయి. ఆ రాష్ట్రాల ఓటర్ల జాబితాల అక్రమాలతో బీజేపీ అధికారం చేపట్టిందనే అనుమానాలను నివృత్తి చేయడంలో ఎన్నికల సంఘం విఫలమైంది.
ఓటర్ల జాబితా సవరణ వివాదాస్పదం
బిహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల ఎన్నికల్లో ఓటర్ల జాబితా సవరణ తీవ్ర వివాదాలు రేపింది. సుప్రీంకోర్టు తలుపుతట్టినా వారికి అవకాశం లభించలేదు. అందులో అత్యధికులు అర్హులైన ఓటర్లేనని తర్వాత జరిపిన దర్యాప్తుల్లో వెల్లడయింది. పశ్చిమ బెంగాల్ లో ట్రిబ్యునల్‌కు వెళ్లిన 22 లక్షల మందిలో, సెప్టెంబరు 10 నాటికి 1.22 లక్షల మందిపై దర్యాప్తు పూర్తయితే 1.14 లక్షల మంది అర్హులైన ఓటర్లే అని తేలింది. అయితే అప్పటికే నష్టం జరిగిపోయింది.
నాటి ఎన్నికల్లో వారి ‘ఓటు వినియోగ హక్కును’ ఎవరు వెనక్కి తెచ్చిస్తారనే ధర్మసందేహం తెరపైకి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ సర్ ప్రక్రియపై ఉద్యమిస్తున్నా.. ఫారమ్-6 విషయంలో కీలక మార్పులు చేపడుతూ ఎన్నికల సంఘం దిద్దుబాటుకు ముందుకు రావడమే కాకుండా సర్ ముగిసిన రాష్ట్రాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఎస్ఐఆర్ పూర్తయిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆన్‌లైన్ ఫారమ్-6లో అదనంగా పెట్టిన ప్రత్యేక ఎస్ఐఆర్ డిక్లరేషన్‌ను తొలగించి, సాధారణ చట్టబద్ధ ఫారమ్-6 విధానాన్ని కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ఇంత గందరగోళం మధ్య ఎన్నికల సంఘం పనిచేస్తుండడంతో అనుమానాలు మరింత రెట్టింపవుతున్నాయి.
సర్ గణాంకాల్లో గందరగోళం
తెలంగాణలో సర్గణాంకాల్లో కూడా గందరగోళం నెలకొంది. ఎస్ఐఆర్‌కు ముందు రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, 2,64,87,213 మంది తమ ఎన్యూమరేషన్ ఫారమ్‌లను సమర్పించారు. వీటిలో 73,39,235 మంది పేర్లు అనుమానాస్పద కేటగిరీలోకి వెళ్లి డ్రాఫ్ట్ జాబితాలో కనిపించలేదు. ఈ సంఖ్యలో సుమారు 9.22 లక్షల మంది మరణించినవారు, 11.25 లక్షల మంది అందుబాటులో లేనివారు, 45.18 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్లినవారు, 6.70 లక్షల మంది డూప్లికేట్ నమోదులు ఉన్నట్లు అధికారులు పేర్కొనగా, మృతి చెందినవారిని తప్పించి మిగతావారి విషయంలో పలు సందేహాలున్నాయి.
ఇదే సమయంలో మరో 92,87,577 మంది ఓటర్లకు సంబంధించిన వివరాల్లో లోపాలతోపాటు మ్యాపింగ్ సమస్యలు ఉన్నట్లు గుర్తించి నోటీసులు ఇచ్చారు. ఇందులో 60,50,918 మంది పేర్లు, వయస్సు, తల్లిదండ్రుల వివరాలు వంటి అంశాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు, మరో 32,36,659 మందిని 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాప్ చేయలేకపోయినట్లు అధికారులు చెబుతుండడంతో గందరగోళం నెలకొంది. కొందరు రాష్ట్రాలు, జిల్లాలు మారవచ్చు. మరికొందరు కొత్తగా నమోదు చేసుకోవచ్చు. వీరందరూ మ్యాపింగ్ ఆధారాలతో దరఖాస్తు చేయాలనడం క్లిష్టతరమే.
‘సర్’ ప్రక్రియలో లోపాలు
‘సర్’ ప్రక్రియలో లోపాలున్నట్టు కాంగ్రెస్ చెబుతున్నట్టే ఇప్పుడు ఇద్దరు కమిషనర్లు కూడా పలు సందేహాలు లేవనెత్తడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యుసీ సమావేశమై దీనిపై దేశవ్యాప్తంగా ప్రజలను జాగృతం చేయాలని నిర్ణయించడంతోపాటు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని, ఈసీ అక్రమాలకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది.
మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి కూడా సమావేశమై దేశంలో ఎన్నికల సంఘం ప్రక్షాళనతోపాటు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అక్టోబర్ 2 నుంచి 8 వరకు ‘సేవ్ డెమోక్రసీ’ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో కీలక అస్త్రమైన ఓటుహక్కును కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం రాజ్యాంగ విరుద్దం. పెద్ద పెద్ద రాజ్యాలు, రాజ్యాధికారాలే కాలానుగుణంగా కుప్పకులాయి.
మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల వ్యవస్థను భ్రష్టుపట్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య వ్యతిరేక తీరుకు నిరసనగా ఉద్యమిస్తున్న కాంగ్రెస్‌తో ప్రజాస్వామ్యవాదులందరూ చేతులు కలిపి దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి.
- బి.మహేశ్‌కుమార్ గౌడ్
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
