- 390 ఎకరాల భూసేకరణ పూర్తి.. రూ.35.50 కోట్లు మంజూరు
- ఎడమ కాలువకు లైన్‌క్లియర్.. కుడి కాలువకు కొనసాగుతున్న ప్రక్రియ
- 42 వేల ఎకరాల ఆయకట్టు రైతులకు ప్రయోజనం
జగిత్యాల, వెలుగు: రెండు దశాబ్దాలుగా రైతులు ఎదురుచూస్తున్న కలికోట సూరమ్మ ప్రాజెక్టు కాలువల పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కుడి, ఎడమ కాలువల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే మొత్తం 390 ఎకరాల భూమిని సేకరించినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఇందుకు రూ.35.50 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఎడమ కాలువకు సంబంధించిన భూసేకరణ పూర్తికాగా.. కుడి కాలువకు అవసరమైన భూముల సేకరణ కొనసాగుతోంది. ప్రక్రియ పూర్తయిన వెంటనే కుడి, ఎడమ కాలువల పనులను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
390 ఎకరాలు సేకరణ
2005లో సూరమ్మ రిజర్వాయర్ చేపట్టాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ వివిధ కారణాలతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదు. సూరమ్మ ప్రాజెక్టు మొదలైతే తమ పంటలకు సాగునీరు అందుతుందని ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడంతో కాలువల నిర్మాణం కూడా ముందుకు సాగలేదు. భూసేకరణకు అడ్డంకులు ఏర్పడడంతో పనులకు బ్రేక్ పడింది. తాజాగా భూసేకరణ ప్రక్రియ వేగం పుంజుకోవడంతో ప్రాజెక్టు కాలువల పనులు పట్టాలెక్కనున్నాయి. కుడి, ఎడమ కాలువల నిర్మాణం కోసం ఇప్పటివరకు మొత్తం 390 ఎకరాల భూమిని సేకరించారు. భూసేకరణకు సంబంధించి రూ.35 కోట్లు నిధులు మంగళవారం విడుదలయ్యాయి. కాలువల నిర్మాణానికి అవసరమైన భూముల విషయంలో రైతులకు నష్టపరిహారం చెల్లింపు, భూసేకరణ ప్రక్రియను పూర్తి చేస్తూ అధికారులు ముందుకు సాగుతున్నారు. ఎడమ కాలువకు భూసేకరణ పూర్తయినప్పటికీ.. కుడి కాలువ భూసేకరణ ఇంకా కొనసాగుతోంది. అవసరమైన భూములను సేకరించి ప్రక్రియ పూర్తి చేయడంపై అధికారులు దృష్టి పెట్టారు.
మూడు మండలాల రైతులకు ప్రయోజనం
కలికోట సూరమ్మ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కథలాపూర్, మేడిపల్లి, భీమారంతో పాటు పరిసర మండలాల్లోని 42 వేల ఎకరాల ఆయకట్టు పొలాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలు పూర్తయితే బీడు భూములు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. సాగునీటి లభ్యత పెరిగితే వ్యవసాయంపై ఆధారపడే రైతులకు స్థిరమైన నీటి వనరు అందుబాటులోకి రానుంది.
