టాటా కార్ల కంటే సేఫ్‌గా మారుతున్న మారుతీ వ్యాగనార్, సెలెరియో మోడల్స్!

టాటా కార్ల కంటే సేఫ్‌గా మారుతున్న మారుతీ వ్యాగనార్, సెలెరియో మోడల్స్!

ఆటోమొబైల్ రంగంలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న మారుతి సుజుకి మరో అడుగు ముందుకు వేసింది. ఇటీవలే తమ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ బాలెనో ఫేస్‌‌లిఫ్ట్ మోడల్‌లో లెవల్-2 ADAS ఫీచర్‌ను ప్రవేశపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతానికి ఇది టాప్-ఎండ్ ఆల్ఫా వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ.. ఈ క్లాస్‌లో ఏడీఏఎస్ ఫీచర్ కలిగిన ఏకైక కార్‌గా బాలెనో రికార్డ్ సృష్టించింది. ఈ నేపథ్యంలోనే తన కార్లన్నింటిలోనూ ఏడీఏఎస్ భద్రతా ఫీచర్లను స్టాండర్డ్‌‌గా తీసుకురావాలని మారుతి నిర్ణయించింది. 

తాజాగా జరిగిన 2026 టెక్నాలజీ స్ట్రాటజీ బ్రీఫింగ్‌లో సుజుకి సంస్థ ఒక కీలక విషయాన్ని వెల్లడించింది. ఎంట్రీ-లెవల్, సామాన్యులకు అందుబాటులో ఉండే చిన్న కార్లలో కూడా ఈ అధునాతన భద్రతా వ్యవస్థను అందించేందుకు తక్కువ ఖర్చుతో కూడిన ఏడీఏఎస్ సూట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది. అయితే అన్ని మోడళ్లలోనూ పూర్తి స్థాయి ఏడీఏఎస్ ఫీచర్లు లభిస్తాయని ఆశించలేం. కార్ల ధరలు పెరగకుండా, సామాన్యులకు కూడా ఈ టెక్నాలజీని చేరువ చేయాలనేదే కంపెనీ ప్లాన్.

మొదటి దశలో బేస్ మోడళ్లలో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్ వంటి కొన్ని ముఖ్యమైన కోర్ ఏడీఏఎస్ ఫీచర్లను మాత్రమే అందించే అవకాశం ఉంది. ధరలను మరింత ఆప్టిమైజ్ చేయడానికి వీలుగా వేరియంట్ వారీగా ఈ ఫీచర్లను విభజించనున్నారు. ముఖ్యంగా ముందు వైపు ఉండే రాడార్ అవసరం లేకుండా.. హై-ప్రెసిషన్ కెమెరాలు, AI చిప్‌లను ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఈ ఏడీఏఎస్ సిస్టమ్‌ను తయారు చేయవచ్చని సుజుకి భావిస్తోంది. రాడార్లతో పోలిస్తే ఈ కాంపోనెంట్స్ చాలా చౌకగా లభిస్తాయని మారుతీ అంటోంది. 

ఇండియన్ రోడ్లు, డ్రైవింగ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. భద్రతా విషయంలో ఎలాంటి రాజీ పడకుండా.. ప్రస్తుతం ఉన్న ఏడీఏఎస్ సిస్టమ్స్‌తో సమానంగా లేదా అంతకంటే మెరుగ్గా ఇది పనిచేస్తుందని సుజుకి ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక టైమ్‌లైన్ ప్రకటించనప్పటికీ.. ఇది ఇండియన్ మార్కెట్‌లోకి వస్తే వాగన్ఆర్, సెలెరియో వంటి ఎంట్రీ-లెవల్ కార్లకు అతిపెద్ద ప్రయోజనం చేకూరుతుంది. దీంతో దేశంలో అత్యంత సురక్షితమైన కార్లను తయారు చేసే టాటా లాంటి కంపెనీలతో పోటీ పడేందుకు ఇది మారుతికి సరైన అవకాశాన్ని అందించనుందని ఆటో నిపుణులు అంటున్నారు.