హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లోని సంతోషిమాత ఆలయంలో అమ్మవారి విగ్రహం పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై పోలీసులు తగిన స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదంటూ హిందూ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల ప్రతినిధులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొంతసేపు ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను డిమాండ్ చేశారు.పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు.
అమ్మవారి విగ్రహానికి సంప్రోక్షణ
మరోవైపు, ఘటన నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామీజీ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారి విగ్రహానికి శాస్త్రోక్తంగా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
