గన్నేరువరం,వెలుగు: గన్నేరువరం మండల ప్రజల సౌకర్యార్థం గుండ్లపల్లె నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు పనులు పూర్తిచేసేందుకు నిధుల కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
మంగళవారం గన్నేరువరంలోని రైతు వేదికలో మండల సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సరిష్కరించాలని సర్పంచులు కోరారు. డబుల్ రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని యువజన నాయకులు వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే.. గత ప్రభుత్వం బకాయి పెట్టిన బిల్లుల కారణంగా కాంట్రాక్టర్ రోడ్డు పనులు చేయడం లేదన్నారు. అవసరమైతే కాంట్రాక్టర్ను మార్చి రోడ్డు నిర్మాణానికి కావాల్సిన నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
