- నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
- రూ.23.85 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నల్గొండ, వెలుగు: నల్గొండ పట్టణంలో అన్ని సదుపాయాలను కల్పించి సమస్యలు లేని పట్టణంగా, తెలంగాణలోనే నంబర్ వన్ మున్సిపల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతానని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మంగళవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ డివిజన్లలో రూ.23. 85కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్గొండ పట్టణ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, పట్టణానికి బయట రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు, పట్టణంలో రూ.500 కోట్లతో చేపట్టిన సీసీ రహదారులు, డ్రైన్ల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. పట్టణానికి 24 గంటలు తాగునీరు అందించేలా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రూ.83 కోట్లతో వాటర్ ప్లాంట్కు శంకుస్థాపన చేయగా, నెల రోజుల్లో ఆ వాటర్ ప్లాంట్ ద్వారా తాగునీరు అందించే పనులు శరవేగంగా నడుస్తున్నాయని చెప్పారు. పట్టణానికి తాగునీటి కోసం ముఖ్యమంత్రిని ఒప్పించి మరో రూ.300 కోట్లు తీసుకొచ్చినట్లు వివరించారు.
గొల్లగూడ సమీపంలో నిర్మించిన 552 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిష్పక్షపాతంగా, పార్టీలకతీతంగా లబ్ధిదారులకు అందించామని గుర్తు చేశారు. తెలంగాణలోనే మొదటి కళాశాలగా పేరుపొందిన ఎన్జీ కళాశాలను మోడల్ కళాశాలగా తీర్చిదిద్దేందుకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రహదారులు, మౌలిక సదుపాయాలతో పాటు, మహిళా స్వయం సహాయక సంఘాలను అభివృద్ధి చేసేందుకు ఇటీవలే రూ.3 కోట్లతో పెట్రోల్ పంపును ప్రారంభించామని, రూ.2 కోట్లతో సూపర్ మార్కెట్ నిర్మిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో కలెక్టర్ బి. చంద్రశేఖర్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ, మున్సిపల్ కమిషనర్ వంశీ, ఆర్ అండ్ బీ ఎస్ఈ పున్నమోహన్, ఈఈ శ్రీధర్ రెడ్డి, డీఈ గణేశ్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరీ రమేశ్, తహసీల్దార్ పరశురాం, మాజీ జడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి ఉన్నారు.
