నల్గొండ, వెలుగు: ప్రభుత్వానికి బద్నాం చేసి చెడ్డపేరు తీసుకువచ్చేందుకు కొందరు అధికారులు కుట్ర చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే ప్రైవేట్ భూములను 22ఏ జాబితాలోకి చేర్చడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న నిషేధిత భూముల జాబితా వ్యవహారంపై మంత్రి స్పందించారు. మంగళవారం నార్కెట్ పల్లి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. 30 శాతం కమిషన్ల కోసమే భూములను నిషేధిత జాబితాలో పెట్టార౦టూ బీఆర్ఎస్ నేత హరీశ్ రావు చేసిన ఆరోపణలపై కోమటిరెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ విచారణలోనే విషయాలన్నీ బయటపడతాయని తెలిపారు. ఎవరెవరు కమీషన్లు తీసుకున్నారు? దీని వెనుక ఉన్న అధికారులు ఎవరు? అనేది త్వరలోనే వెలుగులోకి వస్తుందన్నారు.
గత ప్రభుత్వంలో పదేళ్లు పని చేసిన కొందరు అధికారులు ఈ రోజు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతో ఇలా చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. పలువురు అధికారులకు తాము మంచి పోస్టింగులు ఇచ్చామని, కానీ, తమ మంచితనాన్ని అడ్డం పెట్టుకుని కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ భూములు 22ఏ జాబితాలో చేర్చడంపై ప్రభుత్వం విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు. యాదగిరిగుట్టతో పాటు నల్గొండ జిల్లాలోని చండూరు తదితర ప్రాంతాల్లో కూడా ఇలాంటి సమస్య ఉందని, 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఎవరూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. సీఎం విదేశీ పర్యటన ముగిశాక 22ఏ సమస్యపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
