యాదగిరిగుట్టలో అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

యాదగిరిగుట్టలో అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధమైన పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ శనివారం తెలిపారు. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. నవరాత్రి పూజల్లో  పాల్గొనేందుకు టికెట్ ధరను రూ.1,116గా నిర్ణయించారు. 

ఒక టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దంపతులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. సప్తశతి పారాయణంలో పాల్గొనేందుకు టికెట్ ధరను రూ.116గా నిర్ణయించారు. నవరాత్రి ఉత్సవాల్లో ఏదైనా ఒక రోజు సప్తశతి పారాయణంలో పాల్గొనే అవకాశం భక్తులకు కల్పించారు. లక్ష కుంకుమార్చనకు టికెట్ ధర రూ.116గా నిర్ణయించగా, ఒక్క రోజు పూజలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ‘రుద్ర హోమం’ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు. ఉత్సవాల నేపథ్యంలో చేసిన మార్పులను భక్తులు గమనించి ఆలయ అధికారులకు సహకరించాలని కోరారు.