- దేవరకొండ గర్ల్స్ కాలేజీలో లెక్చరర్ వేధింపులు
దేవరకొండ, వెలుగు: నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో విద్యార్థినులను వేధించిన లెక్చరర్ ను ఏబీవీపీ కార్యకర్తలు, స్టూడెంట్ల తల్లిదండ్రులు చితకబాదారు. కాలేజీ తెలుగు లెక్చరర్ భాస్కర్ కొంత కాలంగా విద్యార్థినులను వేధిస్తుండగా, విషయం తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు మంగళవారం కాలేజీకి చేరుకొని ఆందోళనకు దిగారు. కాలేజీలో ఉన్న లెక్చరర్‌ను చితకబాదారు.
విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్ పై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న దేవరకొండ పోలీసులు కాలేజీకి చేరుకొని తెలుగు లెక్చరర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విద్యార్థినులు మాట్లాడుతూ అసభ్య పదజాలం వాడేవాడని, ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
