మమ్మల్ని కాల్చి చంపేయండి.. జార్ఖండ్ ప్రభుత్వ నిర్ణయంతో జాబ్స్ కోల్పోయిన అభ్యర్థుల ఆవేదన

మమ్మల్ని కాల్చి చంపేయండి.. జార్ఖండ్ ప్రభుత్వ నిర్ణయంతో జాబ్స్ కోల్పోయిన అభ్యర్థుల ఆవేదన

రాంచీ: కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన వారి జీవితాల్లో ఒక్కసారిగా అంధకారం అలుముకున్నది. అక్రమాల ఆరోపణల నేపథ్యంలో జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (జేఎస్‌‌‌‌ఎస్సీ)  సీజీఎల్ సహా పలు రిక్రూట్‌‌‌‌మెంట్ పరీక్షలను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దాదాపు 2 వేల మంది ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చేసింది.

ప్రభుత్వ నిర్ణయంతో ఒకవర్గం సంబురాలు చేసుకుంటుండగా, ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిన వారు తమ జాబ్ కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియా ఎదుట బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కుటుంబానికి తానే ఆధారమని.. ఇప్పుడు ఉద్యోగం పోతే ఎలా పోషించుకోవాలంటూ లాలన్‌‌‌‌ పాండే అనే అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశాడు. ఉద్యోగాన్ని లాక్కునే బదులు కాల్చి చంపేయండి అంటూ రోదించాడు. తమకు నార్కో పరీక్షలు నిర్వహించాలని.. విచారణ ఎదుర్కోవడానికి సిద్ధం అని పేర్కొన్నాడు.

కార్యాలయాల్లోకి నో ఎంట్రీ 

కార్యాలయ సెక్యూరిటీ గార్డు తన గుర్తింపు కార్డును పరిశీలించి లోపలికి అనుమతించలేదంటూ విజిలెన్స్‌‌‌‌ శాఖలో పనిచేస్తున్న కోడెర్మాకు చెందిన సందీప్ యాదవ్ వాపోయాడు. రెండు నెలల క్రితమే తనకు పెళ్లయిందని, ఉద్యోగం చూసే తనకు పిల్లను ఇచ్చారని చెప్పాడు.‘‘ఇప్పుడు ఉద్యోగం పోయింది.. కావాలంటే ఈ బంధాన్ని వదిలేసుకో’’ అని తన భార్యతో చెప్పానని కన్నీటి పర్యంతమయ్యాడు.

‘‘ముఖ్యమంత్రి స్వయంగా నియామక పత్రం ఇచ్చి, ఇప్పుడు ఆయనే ఉద్యోగం లాగేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు చూశాకే పాత ఉద్యోగానికి రాజీనామా చేశా. ఇప్పుడు కొత్త ఉద్యోగాలకు పోటీ పడే వయసు కూడా దాటిపోయింది” అంటూ సెక్రటేరియెట్‌‌‌‌లో పనిచేస్తున్న రఘువేంద్ర తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాడు. కోర్టు తీర్పుల తర్వాతే ఉద్యోగాల్లో చేరామని, నిరసనకారుల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తమకు తీవ్ర అన్యాయం చేసిందని బాధిత అభ్యర్థులు వాపోయారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.