- రూ.6 వేల కోట్ల వడ్డీ కడుతున్నాం
- ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు
- బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పులతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని కామెంట్
ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: కేసీఆర్ చేసిన అప్పులతో రాష్ట్ర ఖజానాకు చిల్లు పడిందని, బీఆర్ఎస్ చేసిన అప్పులకు వేల కోట్ల వడ్డీ కడుతున్నామని రాష్ట్ర అబ్కారీ, పర్యాటక, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ కె.హరిత, ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, హరీశ్ బాబుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన అప్పులతో నెలకు రూ.6 వేల కోట్ల వడ్డీ కడుతున్నామని, అందుకే అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. అయినా అభివృద్ధి సంక్షేమం ఎక్కడా ఆగలేదని, అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, వారికి ఆర్థికంగా తోడ్పాటునందించేందుకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో పర్యాటకరంగ అభివృద్ధికి రూ.10 కోట్ల చొప్పున నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
73 లక్షల ఓట్లు డేంజర్లో ఉన్నయ్
రాష్ట్రంలో 73 లక్షల మంది ఓటర్లను అనామలిస్ లో పెట్టడం దారుణమని మంత్రి జూపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. సర్ మొదటి విడత ప్రక్రియ పూర్తయి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అనుమానిత, షిఫ్ట్ ఓట్ల జాబితాపై కోఆర్డినేషన్ మీటింగ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో నిర్వహించారు. హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ఓట్ల కోసం ఇంటింటికీ వెళ్లే నాయకులు ఇప్పుడు అర్హులు, నిరక్షరాస్యుల ఓట్లు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు. తొలగింపుకు గురైన ఓటర్ల ఇండ్లకు వెళ్లి వారి వద్ద ఉన్న ఆధారాలు సేకరించి ఫారం నింపి బీఎల్ ఏ ద్వారా ఈ ఆర్వోకు సమర్పించాలని సూచించారు. ఓటు హక్కు కోల్పోతే సంక్షేమ పథకాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయంగా దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తోందని, దీన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, డీసీసీ అధ్యక్షరాలు సుగుణ, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్రియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్డే అనిల్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్లు ఆకాశ్, సహీన్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
