పెట్రోల్‌లో ఇథనాల్ కలపడంపై మోడీ ప్రభుత్వం కీలకమైన ఆలోచన చేస్తోంది. దేశంలో ప్రస్తుతం అమ్ముతున్న 20 శాతం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌తో పాటు, పాత వాహనాల కోసం తిరిగి 10 శాతం ఇథనాల్ బ్లెండ్ పెట్రోల్‌ను కూడా అందుబాటులోకి తెచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ప్రాథమిక దశలో చర్చలు జరుగుతున్నట్లు వెల్లడైంది.
గత ఏడాది భారత్ తన లక్ష్యానికి 5 ఏళ్ల ముందే 20 శాతం ఇథనాల్ కలపడాలనే లక్ష్యాన్ని చేరుకుంది. అయితే ఈ20 ఇంధనం వల్ల పాత వాహనాలు, ద్విచక్ర వాహనాలు దెబ్బతింటాయనే ఆందోళనలు, ఇప్పటికే వాహనాలకు రిపేర్స్ భారీగా పెరగటం ఆందోళనలు కలిగిస్తోంది. దీంతో వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. అందరికీ ఇంధన ఎంపికలో వెసులుబాటు కల్పించాలనే కోణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందని వెల్లడైంది.
ఇటీవల కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ కూడా వినియోగదారులకు తక్కువ బ్లెండ్ ఇథనాల్ ఉన్న E10 పెట్రోల్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తేవాలని ప్రతిపాదించారు. పాత వాహనాల యజమానుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని సాంకేతిక, సాంకేతికేతర అంశాలపై చర్చలు జరుపుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు.
దేశవ్యాప్తంగా పెట్రోల్ రిటైల్ నెట్‌వర్క్‌లో ఒకే సమయంలో E10, E20 వంటి వివిధ గ్రేడ్ల ఇంధనాలను అందించడం వల్ల సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని గతంలో ప్రభుత్వం భావించింది. ఇది భారీ లాజిస్టికల్ సవాల్‌గా మారి.. ఖర్చులు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అయినప్పటికీ ప్రజల నుంచి వస్తున్న స్పందనను బట్టి ప్రభుత్వం ఈ అంశాన్ని మరోసారి పరిశీలిస్తోంది.
ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనలు కేవలం చర్చల దశలోనే ఉన్నాయి. ఇంధన సరఫరా గొలుసు, దేశీయ డిమాండ్ వంటి అంశాలను బేరీజు వేసుకున్న తర్వాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. మోడీ సర్కార్ తీసుకునే ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. పాత వాహనదారులకు ఇంధన ఎంపికలో భారీ ఊరట లభించనుంది. అయితే ఈ నిర్ణయం ఈసారి సార్వత్రిక ఎన్నికలకు ముందు అమలులోకి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎలక్షన్స్ ముందు ప్రజల ఆగ్రహం తగ్గించి వారిని ప్రసన్నం చేసుకునేందుకు E10 పెట్రోల్ అస్త్రంగా మారొచ్చని కూడా నెటిజన్లు అంటున్నారు. చూడాలి మోడీ సర్కార్ ఎలా ఈ విషయంపై ముందుకు సాగుతుంది అన్నది.
