కరీంనగర్లో గణేశ్ మండపాలన్నింటికీ ఫ్రీ కరెంట్

 కరీంనగర్లో గణేశ్ మండపాలన్నింటికీ ఫ్రీ కరెంట్
  •     ఛార్జీలన్నీ కార్పొరేషన్ చెల్లించాలని నిర్ణయం
  •     పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్న వినాయక మండపాలన్నింటికీ ఉచితంగా కరెంట్ అందించాలని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. అందుకయ్యే కరెంట్ బిల్లులన్నీ కరీంనగర్ కార్పొరేషన్ చెల్లిస్తుందని ప్రకటించారు. కార్పొరేషన్ పరిధిలో ఏటా దాదాపు 2 వేల గణేశ్ మండపాలను ఏర్పాటు చేస్తుండగా గత మూడేళ్లుగా ఈ మండపాలకు వినియోగిస్తున్న కరెంట్ ఛార్జీలను మొత్తం బండి సంజయ్ తన సొంత డబ్బులతో చెల్లిస్తున్నారు.

ప్రస్తుతం కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగించిన నేపథ్యంలో గణేశ్ మండపాల కరెంట్ బిల్లులన్నీ కార్పొరేషన్ చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా మంగళవారం 21వ డివిజన్ విద్యానగర్​లోని శ్రీరాంనగర్ కాలనీలో రూ.కోటి మున్సిపల్ జనరల్ ఫండ్స్ తో సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కమిషనర్ ప్రపుల్ దేశాయ్, స్థానిక కార్పొరేటర్లతో కలిసి శంకుస్థాపన చేశారు.