గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ అధికారులు తమ ఇంటిని అకారణంగా కూల్చివేశారని ఆరోపిస్తూ గోదావరిఖని పట్టణానికి చెందిన వృద్ధ దంపతులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలో తమకు వారసత్వంగా వచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకున్నామని, అధికారులు కూల్చివేయడంతో రోడ్డున పడ్డామని వృద్ధ దంపతులు మీనుగు మొగిలి, లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు న్యాయం చేయాలని కోరుతూ కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోలేదని వాపోయారు. బాధితుల కోడలు అనూష మాట్లాడుతూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇంటిని కూల్చివేశారని కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగినా స్పందించడం లేదన్నారు. వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నవీన్ ఘటనా స్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
