నెలకు రూ.లక్షా 30వేలు సంపాదన.. పదివేలు కూడా మిగలట్లే: వైరల్ ఖర్చుల చిట్టా

నెలకు రూ.లక్షా 30వేలు సంపాదన.. పదివేలు కూడా మిగలట్లే: వైరల్ ఖర్చుల చిట్టా

ప్రస్తుత కాలంలో నెలకు లక్ష రూపాయలకు పైగా జీతం వస్తోందంటే ఎవరైనా చాలా గొప్పగా భావిస్తారు. దాంతో లగ్జరీ లైఫ్ గడపవచ్చని, డబ్బు గురించిన ఆందోళనలు ఉండవని అందరూ అనుకుంటారు. కానీ చేతికి వచ్చే జీతం ఎంత ఎక్కువగా ఉన్నా.. రోజువారీ ఖర్చులు, బాధ్యతలు ఆ మొత్తాన్ని ఎలా కరిగించేస్తాయో చెబుతున్న పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రెడ్ డిట్ వేదికగా 'r/IndiaFinance' గ్రూప్‌లో ఓ యువకుడు పంచుకున్న తన జీత కష్టాల పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

నెలకు రూ.లక్షా 30వేల జీతం ఎలా మాయమైపోతుందో తనకే అర్థం కావడం లేదంటూ ఒక ఉద్యోగి పోస్ట్ పెట్టాడు. చిన్న వయస్సులోనే తాను సంపాదిస్తున్న మెుత్తాన్ని చూసుకుని ఎంతో అబ్బురపడ్డానని, అప్పట్లో ఈ స్థాయి జీతం వస్తే ఇక డబ్బు గురించి ఆలోచించాల్సిన పనే ఉండదని అనుకునేవాడినని సదరు యువకుడు చెప్పుకొచ్చాడు. అయితే రియల్ లైఫ్ లో సంపాదన చేతికి అందాక లెక్కలు పూర్తిగా తారుమారయ్యాయని వాపోయాడు. తాను చేసే ప్రతి చిన్న ఖర్చు నెలాఖరు నాటికి జీతాన్ని సున్నాగా మార్చేస్తోందంటూ ఖర్చుల చిట్టాను పంచుకున్నాడు.

అతని నెలవారీ ఖర్చుల్లో ముఖ్యంగా ఇంటి అద్దెకు రూ.30వేలు, కుటుంబ అవసరాల కోసం తల్లిదండ్రులకు రూ.12వేలు, కిరాణా సామాగ్రికి రూ.8వేలు ఖర్చవుతున్నాయి. ఇక కరెంట్, ఇంటర్నెట్, ఫోన్ బిల్లుల కోసం రూ. 6వేలు, పెట్రోల్ రవాణా ఖర్చుల నిమిత్తం రూ.7వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఇవే కాకుండా ఒక ఈఎంఐకి రూ.15వేలు కడుతుండగా, భవిష్యత్తు కోసం చేసే SIP పెట్టుబడులకు రూ.10వేలు కేటాయిస్తున్నాడట. వైద్య అవసరాలు, ఇన్సూరెన్స్ కోసం రూ.5వేలు ఖర్చవుతుండగా, బయట తినే ఆహారానికి రూ.4వేలు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల కోసం రూ.3వేలు పోతున్నాయట. మరోవైపు ఆన్‌లైన్ యూపీఐ చెల్లింపులు రూ.5వేలు, షాపింగ్ కోసం రూ.5వేలు అవుతుండగా, ఎటూ తేలని ఇతర చిల్లర ఖర్చుల కింద రూ.10వేలు ఖర్చైపోతున్నాయి. ఇవన్నీ కలుపుకుంటే నెలాఖరుకు కేవలం రూ.10వేలు మాత్రమే మిగులుతున్నాయట.

మిగిలిన 10 వేల రూపాయలతోనే మిగతా నెలను నెట్టుకొరావాలని, ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల వైపు కూడా చూడటానికి భయమేస్తుందని పేర్కొన్నారు. బయట చూసేవారికి రూ.లక్షా 30వేలు జీతం అంటే విలాసవంతమైన జీవితంలా కనిపిస్తుందని.. కానీ అందులో వందలాది సాధారణ ఖర్చులు తన జీతాన్ని నిశ్శబ్దంగా మింగేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ పోస్ట్‌పై స్పందించిన తోటి రెడ్ డిట్ వినియోగదారులు అనేక సలహాలు ఇచ్చారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి స్పెండ్ ట్రాకర్ యాప్‌లను ఉపయోగించాలని.. ఏయే వస్తువులపై అనవసరంగా డబ్బు ఖర్చవుతుందో గమనించి కొద్ది రోజులు పొదుపు సూత్రం పాటించాలని కొందరు సూచించారు. ఏది ఏమైనా.. నేటి నగర జీవనంలో అధిక వేతనాలు పొందుతున్న మధ్యతరగతి ఉద్యోగుల ఆర్థిక వాస్తవికతను ఈ ఘటన అద్దం పడుతోంది.