అన్నం తింటుండగా.. ఇంట్లో నుంచి తీసుకెళ్లి చంపేశారు

అన్నం తింటుండగా.. ఇంట్లో నుంచి తీసుకెళ్లి చంపేశారు
  • కాజీపేట మండలం రాంపూర్​ గ్రామంలో ఘటన
  • వియ్యంకుడిపై అనుమానాలు?

ధర్మసాగర్, వెలుగు: ఇంట్లో అన్నం తింటున్న ఓ వ్యక్తిని బయటికి తీసుకెళ్లి హత్య చేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం రాంపూర్‌‌‌‌ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా చిల్పూర్‌‌‌‌ మండలకేంద్రానికి చెందిన పోలు వెంకటేశ్వర్లు(45), రాజమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రమ్య నాలుగేళ్ల క్రితం ఇంటి పక్కనే ఉండే అంబటి వినయ్‌‌‌‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అనంతరం కుటుంబ కలహాలతో ఇద్దరు విడిపోయి విడాకులు తీసుకున్నారు. గతంలో జరిగిన పంచాయితీలో వినయ్‌‌‌‌ తండ్రి అంబటి పరమేశ్వర్‌‌‌‌.. రమ్య తండ్రి వెంకటేశ్వర్లుపై దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. 

సోమవారం రాత్రి 7.45 గంటలకు రాజమణి, వెంకటేశ్వర్లు దంపతులు, చిన్న కుమార్తెతో కలిసి ఇంట్లో భోజనం చేస్తున్నారు. ఈ సమయంలో చిల్పూర్‌‌‌‌ మండలం పల్లె గ్రామానికి చెందిన దామెర సంపత్‌‌‌‌  వారి ఇంటికి వచ్చి వెంకటేశ్వర్లును తన వెంట తీసుకెళ్లాడు. రాత్రి 11.30 గంటలైనా ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సంపత్‌‌‌‌కు ఫోన్‌‌‌‌ చేశారు. గ్రామపంచాయతీ వద్ద వెంకటేశ్వర్లును దింపినట్లు సంపత్‌‌‌‌ చెప్పాడు. అక్కడికి వెళ్లి చూడగా ఆయన కనిపించలేదు. సంపత్‌‌‌‌ ఇంటికి వెళ్లగా అతడూ లేకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. అనంతరం సంపత్‌‌‌‌ ఫోన్‌‌‌‌ స్విచ్ఛాఫ్‌‌‌‌ అయింది.

రక్తపు మడుగులో డెడ్​బాడీ..

మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో రాంపూర్‌‌‌‌ గ్రామానికి వెంకటస్వామి తమ గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు చిల్పూర్​ గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు రాంపూర్‌‌‌‌లోని మడేలయ్య గుడి సమీపంలోని మత్తడి వద్దకు వెళ్లారు. అక్కడ రక్తపు మడుగులో వెంకటేశ్వర్లు మృతదేహం కనిపించింది. గొంతు కోసి ఆయనను హతమార్చినట్లు గుర్తించారు. తన భర్తను అంబటి పరమేశ్వరే హత్య చేశాడని ఆరోపిస్తూ రాజమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ధర్మసాగర్‌‌‌‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.