- ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై విద్యాశాఖ దృష్టి సారించింది. విద్యార్థులకు టెక్నికల్ ఎడ్యుకేషన్ ను మరింత చేరువ చేసేందుకు వీలుగా మొదటి దశలో 80 జూనియర్ కాలేజీల్లో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ గదులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ను మంజూరు అయింది.
సమగ్ర శిక్షా నిధుల నుంచి రూ. 20 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఎంపిక చేసిన 80 కాలేజీల్లో ఒక్కో కంప్యూటర్ గది నిర్మాణానికి రూ. 25 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ నిధులతో గదుల నిర్మాణంతో పాటు ఫర్నిచర్, గదుల్లో విద్యుదీకరణ, ఇతర వసతులను కల్పించనున్నారు. పనుల బాధ్యతను తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూఐడీసీ)కు అప్పగించారు.
ఈ-ప్రొక్యూర్‌మెంట్ పద్ధతిలో టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. టెండర్ల ప్రక్రియ ముగిసి ఒప్పందం కుదుర్చుకున్న ఆరు నెలలలోపు కంప్యూటర్ ల్యాబ్‌ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని విద్యాశాఖ గడువు విధించింది. పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నిబంధనల ప్రకారం గదులను నిర్మించి సంబంధిత ప్రిన్సిపాల్‌లకు అప్పగించాలని ఆదేశించింది.
ఏ జిల్లాకు ఎన్ని ల్యాబ్‌లంటే..
రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 80 జూనియర్ కాలేజీల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాకు 9 కంప్యూటర్ ల్యాబ్ గదులు మంజూరు కాగా, సంగారెడ్డి జిల్లాకు 7, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెరో 6 చొప్పున కేటాయించారు. రంగారెడ్డి జిల్లాకు 5, ఆదిలాబాద్, మెదక్, నిర్మల్ జిల్లాలకు 4 చొప్పున, జగిత్యాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలకు చెరో 3 చొప్పున కంప్యూటర్ గదులు నిర్మించనున్నాయి.
ఇక భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, నారాయణపేట, నిజామాబాద్, వనపర్తి, వరంగల్ జిల్లాలకు రెండేసి చొప్పున.. కరీంనగర్, మేడ్చల్, ములుగు, నల్గొండ జిల్లాలకు ఒక్కో కాలేజీకి ఒక్కో ల్యాబ్ చొప్పున గదులను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
