- తప్పును ఒప్పుకొని సరిదిద్దుతున్నం
- పేదల భూమిలో ఒక్క అంగుళం కూడా ప్రభుత్వం తీసుకోదు
- ధరణితో చేసిన తప్పులకు సమాధానం చెప్పే ధైర్యం హరీశ్ రావుకు ఉందా?
- కాళేశ్వరం పరిణామాలకు ఎందుకు బాధ్యత తీసుకోలేదు?
- ఏలేటి ఆరోపణలకు ఆధారాలుంటే చూపాలని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: నిషేధిత జాబితాలోని భూముల సమస్యను పరిష్కరించే ప్రక్రియ ప్రారంభమైందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా 24 గంటల్లోనే మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో నాలుగు రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పారు. పేదల భూమిలో ఒక్క అంగుళం కూడా ప్రభుత్వం తీసుకోదని, వారి హక్కులు, ఆస్తులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు.
మంగళవారం సచివాలయంలో మీడియాతో మంత్రి చిట్చాట్చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు 22ఏ నిషేధిత భూముల వివరాలను ఆన్‌లైన్ లో అప్‌లోడ్ చేయడంలో క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాట్లను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సరిదిద్దుతోందన్నారు. కావాలనే 22ఏలో భూములు పెట్టి, వాటిని తొలగించడానికి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ‘విమర్శలు చేయడం చాలా సులువు. కానీ, బాధ్యత తీసుకోవడం అంత సులువు కాదు. పొరపాటు జరిగిందని బహిరంగంగా అంగీకరించాం. సరిదిద్దే బాధ్యతను కూడా తీసుకున్నాం.
పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ధరణి పేరుతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు, జరిగిన తప్పులకు ఏనాడైనా బాధ్యత తీసుకున్నారా? కనీసం క్షమాపణ చెప్పారా?”అని మంత్రి ప్రశ్నించారు. ‘కాళేశ్వరం విషయంలో జరిగిన పరిణామాలకు హరీశ్ రావు ఏనాడైనా బాధ్యత తీసుకున్నారా? నేను నా శాఖలో పొరపాటు జరిగిందని చెప్పి, దానిని పరిష్కరించే బాధ్యత తీసుకుంటున్నాను. ఇదే వారికి, నాకు తేడా’అని అన్నారు.
పేదవాడి సమస్యను రాజకీయంగా వాడుకోవడం మానేయాలని, అబద్ధాలు, రాజకీయ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరని హితవుపలికారు. తప్పు జరిగితే దాన్ని అధికారుల మీదకు నెట్టేసి చేతులు దులుపుకోవడం తమ ప్రభుత్వ విధానం కాదన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న హరీశ్ రావుకు ఇప్పటికీ 30 శాతం కమీషన్లు ఎందుకు గుర్తుకొస్తున్నాయో ప్రజలకు తెలుసన్నారు.
ఆరోపణలకు ఆధారాలు చూపాలి..
బీజేఎల్‌పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపైనా మంత్రి పొంగులేటి స్పందించారు. ‘తాటాకు చప్పుళ్లకు నేను భయపడను. నాపై ఏదైనా ఆరోపణ చేస్తే ఆధారాలతో మాట్లాడాలి. ఆధారం ఉంటే ప్రజల ముందు పెట్టాలి. ఫీనిక్స్, రాఘవ తదితర సంస్థలతో వ్యాపారపరంగా లావాదేవీలు జరగడం సహజం. వాటిని పట్టుకుని రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదు. నేను రెండు దశాబ్దాలుగా వ్యాపార రంగంలో ఉన్నాను.
అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చాను. ఒక్కరోజులో వేల కోట్లకు ఎదిగిన వ్యక్తిని కాదు. నా వ్యాపార ప్రస్థానం, నా నేపథ్యం గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆరోపణలు చేసేవారు ముందుగా వాస్తవాలు తెలుసుకోవాలి’అని హితవు పలికారు.
జెన్యూన్ ప్రైవేట్ ఆస్తులన్నీ తక్షణమే క్లియర్ వివిధ జీవోలు, మెమోల ద్వారా గత ప్రభుత్వాల కాలంలో క్రమబద్ధీకరించిన ప్రైవేట్ భూములు, హైకోర్టు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అనుమతులు పొందిన స్థలాలు ఆన్‌లైన్ అప్‌లోడింగ్‌లో సాంకేతిక లోపం కారణంగా 22ఏ జాబితాలోకి వచ్చాయని మంత్రి వివరించారు. ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే గుర్తించిందని, బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పునరుద్ధరించామని తెలిపారు.
22ఏ సమస్యల త్వరిత పరిష్కారం కోసం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, రాబోయే 15 రోజుల పాటు ఈ కమిటీ రోజువారీగా దరఖాస్తులను పరిశీలించి.. జెన్యూన్ ప్రైవేట్ ఆస్తులన్నింటినీ తక్షణమే క్లియర్ చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
