టెర్రరిస్టులకు తుర్కియే క్షమాభిక్ష.. చట్టంపై సంతకం చేసిన ఎర్డొగాన్

టెర్రరిస్టులకు తుర్కియే క్షమాభిక్ష.. చట్టంపై సంతకం చేసిన ఎర్డొగాన్

అంకారా (తుర్కియే): దేశంలో శాంతి నెలకొల్పే ప్రయత్నాల్లో భాగంగా కుర్దిష్  టెర్రరిస్టులకు క్షమాభిక్ష పెట్టాలని తుర్కియే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూపొందించిన బిల్లును అక్కడి పార్లమెంట్ ఇటీవలే పాస్ చేసింది. తాజాగా ఈ చట్టంపై ప్రెసిడెంట్ రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ సంతకం చేశారు. ఈ చట్టం ప్రకారం.. దోషులుగా తేలిన కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే) మిలిటెంట్లకు జైలు శిక్షను ప్రభుత్వం రద్దు చేస్తుంది.

వివిధ కేసుల్లో ఇతరులు ఎదుర్కొంటున్న విచారణను ఆయా కేసుల తీవ్రతను బట్టి ఐదు లేదా పదేళ్ల పాటు వాయిదా వేస్తుంది. ఈ కాలంలో ఎలాంటి నేరాలకు పాల్పడకుంటే అధికారులు వారిపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటారు. అయితే పీకేకే పూర్తిగా రద్దైందని, ఆ పార్టీ సభ్యులు ఆయుధాలు వీడారని జాతీయ భద్రతా మండలి నిర్ధారించిన తర్వాతే ఈ చట్టం అమల్లోకి రానుంది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.