భూమిపై నూకలుంటే ఎలాగైనా బతుకుతారు అంటే ఇదేనేమో. అత్యంత విషపూరితమైన ఇంజెక్షన్. మరణ శిక్షలో భాగంగా ఒక్క ఇంజెక్షన్ వేస్తే ఎంత బలమైన వ్యక్తి అయినా చనిపోవాల్సిందే. అలాంటిది ఈ మహిళ రెండు ఇంజెక్షన్లు వేసినా బతికింది. మరణశిక్ష నుంచి బయటపడింది. అమెరికా జైలర్లను, వైద్యులను మాత్రమే కాకుండా ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసిన ఘటన ఇది. ఇప్పుడు ఈ మృత్యుంజయురాలి వార్త వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో 50 ఏళ్ల క్రిస్టా పైక్ అనే మహిళకు ఉరిశిక్ష అమలు చేసే ప్రయత్నం చేశారు జైలు అధికారులు. ఉరిశిక్షలో భాగంగా అత్యంత విషపూరితమైన ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ.. ఆమె బతకటం సంచలనంగా మారింది. రెండు మోతాదుల పెంటోబార్బిటల్ ఇంజెక్షన్ ఇచ్చినా ఆమె బతికిపోయింది. ఈ ప్రయత్నం విఫలం కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీంతో రాష్ట్రంలో ఈ ఏడాది విధించాల్సిన అన్ని ఉరిశిక్షలను రాష్ట్ర గవర్నర్ నిలిపివేశారు.
ఏంటి కేసు:
1995లో తన సహచర విద్యార్థిని కోలీన్ స్లెమ్మర్‌ను చిత్రహింసలు పెట్టి హత్య చేసిన కేసులో క్రిస్టా పైక్‌కు మరణశిక్ష విధించారు. 1996లో 18 ఏళ్ల వయసులో ఆమెను దోషిగా నిర్ధారించారు. ఆమె, ఆమె స్నేహితుడు, ప్రియుడు కలిసి బాక్స్ కట్టర్‌తో స్లెమ్మర్‌ను కొట్టి, ఛాతీపై పెంటగ్రామ్ చెక్కి, తలకపాలం (పుర్రె) భాగాన్ని తీసేశారు. అప్పట్లో ఈ ఘటన అత్యంత క్రూరమైన హత్యగా రికార్డుకెక్కింది. ఈ హత్యకు ఆమెకు మరణశిక్ష, ఆమె ప్రియుడు టాడరైల్ షిప్‌కు జీవిత ఖైదు విధించారు.
అయితే పైక్ కు విధించిన మరణ శిక్ష.. టెన్నెస్సీలో 200 ఏళ్ల తర్వాత మళ్లీ మహిళకు ఉరిశిక్ష విధిస్తుండటం ఇదే . 2026 సెప్టెంబర్ 30న నాష్‌విల్‌లో ఉదయం 10 గంటలకు ఉరితీయాలని నిర్ణయించారు. అయితే చివరి నిమిషంలో 6వ సర్క్యూట్ అప్పీల్ కోర్టు ఆమె న్యాయవాదులు లేవనెత్తిన వాదనలను పరిశీలించాలని.. ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆమె బాల్యంలో లైంగిక వేధింపులకు గురైనట్లు, బైపోలార్ డిజార్డర్, పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉన్నట్లు వాదించారు. దీంతోనే ఆమె అలా ప్రవర్తించిందని కోర్టుకు తెలిపారు.
అయితే లాయర్ల వాదనను రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం సుప్రీంకోర్టునుదృష్టికి తీసుకెళ్లింది. సుప్రీంకోర్టు ఆ తాత్కాలిక స్టేను రద్దు చేసి ఉరిశిక్షకు అనుమతి ఇచ్చింది.
తర్వాత ప్రాణాంతక ఇంజెక్షన్ ప్రక్రియ మొదలుపెట్టారు. సాయంత్రం 7:46కి మొదటి మోతాదు పెంటోబార్బిటల్ ఇచ్చారు. ఆ సమయంలో ఆమె ప్రశాంతంగానే ఉన్నట్లు మీడియా ప్రతినిధులు తెలిపారు. నేను నా జీవితంలో ఎక్కువ భాగం ప్రేమతో గడిపినట్లే ఈ ప్రపంచాన్ని విడిచిపెడతాను అని చివరి మాటలు చెప్పింది. అయితే ఇంజెక్షన్ వేసిన తర్వాత కూడా చనిపోక పోగా.. ఆమె మేల్కొని నా చేయి పగిలిపోతున్నట్లు అనిపిస్తుంది అని చెప్పడంతో డాక్టర్లు, జైలు అధికారులు షాకయ్యారు.
ప్రోటోకాల్ ప్రకారం 8:26కి రెండో మోతాదు ఇచ్చారు. కానీ ఆమె గురక పెడుతూ ఉండటం మరోసారి షాక్ కు గురిచేసింది. 8:53కి మైక్రోఫోన్ ఆపేశారు. ఆమె చనిపోలేదని నిర్ధారించుకుని.. ఆమె న్యాయవాదులు ఆమెను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ప్రాణాంతక ఇంజెక్షన్ ఎందుకు పనిచేయలేదు:
ఎంతో డేంజర్, క్షణాల్లో మనిషి ప్రాణాలు తీసే ఇంజెక్షన్ పనిచేయకపోవడంపై చాలా చర్చలు జరిగాయి. ఏంటి ఆమెకు అంతె రెసిస్టెన్స్ పవర్ ఉందా..? లేక ఏదైనా మిరాకిల్ జరిగిందా అనే చర్చ జరిగింది. అయితే ఆమె సిరలు (గుండెకు రక్తం తీసుకెళ్లే నరాలు) చాలా సన్నగా ఉన్నందున.. ఇంజెక్షన్ సిరలను దాటి.. చర్మం కింది భాగంలో రిలీజ్ అయినట్లు చెబుతున్నారు. దీంతో ఇచ్చిన చోటనే ఆ విషయం ఉండి.. చేయికి డ్యామేజ్ అయ్యిందే కాని.. ఆమె ప్రాణాలు పోలేదని డాక్టర్లు తెలిపారు. బాడీలో కొంత భాగం దెబ్బతిన్నట్లు తెలిపారు. ఉరిశిక్ష వేయాలనుకున్న అధికారులు ఈ ఘటనతో ఆమెను బతికించే ప్రయత్నం చేస్తున్నారు.
టెన్నెస్సీ కరెక్షన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు మాట్లాడుతూ.. చట్టబద్ధంగానే ప్రోటోకాల్‌ను పాటించాం. ఔషధం సమర్థవంతంగా పనిచేస్తుంది కూడా.. కానీ ఆమె కేసులో ఇలా జరిగిందని ప్రకటించింది. ఈ విష ప్రయోగం వైఫల్యం తర్వాత గవర్నర్ బిల్ లీ విచారణకు ఆదేశించారు. ఈ ఏడాది మిగిలిన ఉరిశిక్షలను (డిసెంబర్ 3న గ్యారీ వేన్ సట్టన్ ఉరిశిక్షతో సహా) నిలిపివేశారు. టెన్నెస్సీలో ఉరిశిక్ష విఫలమైన ఘటనలో ఇది రెండోది. మే నెలలో కూడా ఒక వ్యక్తిలో సిర కనిపెట్టలేక ఒక ఉరిశిక్షను రద్దు చేశారు.
