తోటి కోడలే హంతకురాలు..ఆభరణాల కోసం గొంతు కోసి చంపిన మహిళ

తోటి కోడలే హంతకురాలు..ఆభరణాల కోసం గొంతు కోసి చంపిన మహిళ
  • మరో ఘటనలో మహిళను బొలేరోతో గుద్ది చంపిన ప్రియుడు 
  • నాగర్​కర్నూల్​ జిల్లాలో రెండు మర్డర్ కేసులను ఛేదించిన పోలీసు

నాగర్​కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్​కర్నూల్ జిల్లాలో జరిగిన రెండు హత్య కేసులను పోలీసులు ఛేదించారు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన ప్రియురాలిని ప్రియుడు బొలెరో వాహనంతో ఢీకొట్టి హత్య చేయగా.. ఆస్తి, నగల కోసం ఓ మహిళ తన తోటికోడలిని గొంతుకోసి చంపింది. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు కేసుల వివరాలు వెల్లడించారు. 

బిజినపల్లి మండలం బొర్సుగడ్డ తండాకు చెందిన కేతావత్‌‌ చిట్టెమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. భర్త జంపాలియా మూడేళ్ల క్రితం మృతిచెందగా.. సంతానం లేదు. ఆమెకు చెందిన భూమిని నలుగురు తోటికోడళ్లలో ముగ్గురు కౌలుకు తీసుకునేవారు. పెద్ద తోటికోడలు కేతావత్‌‌ హిరమ్మ చిట్టెమ్మ భూమి, బంగారు, వెండి ఆభరణాలపై కన్నేసింది. ఈ నెల 15న రాత్రి 11 గంటలకు చిట్టెమ్మ ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి గుడుంబా తీసుకెళ్లింది. 

ఇద్దరూ మద్యం సేవించగా.. చిట్టెమ్మ మద్యం మత్తులో పడిపోయింది. దీంతో హిరమ్మ కత్తితో ఆమె గొంతుకోసి హత్య చేసి, కాళ్లకు ఉన్న వెండి కడియాలు, గొలుసులు తీసుకుని వెళ్లిపోయింది. పోలీసుల విచారణలో హిరమ్మ నేరాన్ని అంగీకరించడంతో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. 

డబ్బుల కోసం ప్రియురాలి హత్య..

తాడూరు గ్రామానికి చెందిన వెనుపోతుల భీమయ్య బొలెరో వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తెలకపల్లి మండలం రాకొండకు చెందిన బంగారమ్మ కుటుంబ కలహాలతో భర్తను వదిలి తల్లిగారి గ్రామంలో ఒంటరిగా ఉంటోంది. ఆమెకు 19 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఈ క్రమంలో భీమయ్యతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. తన అవసరాల కోసం బంగారమ్మ భూమిని విక్రయించగా.. భీమయ్య ఆమె వద్ద కొంత నగదుతో పాటు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టించి మరిన్ని డబ్బులు తీసుకున్నాడు. కొంతకాలంగా డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. 

ఈ నెల 15న డబ్బులు కావాలని బంగారమ్మ గట్టిగా అడగడంతో తాడూరులోని తన వ్యవసాయ పొలం వద్దకు రావాలని పిలిచాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో బొలెరోతో బంగారమ్మను ఢీకొట్టి హత్య చేశాడు. భీమయ్యను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించారు.