హైదరాబాద్: BMW కారు యజమాని నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసిన కేసులో నలుగురు ఫేక్ ట్రాన్స్ జెండర్లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బోడుప్పల్‌కు చెందిన యాదగిరి (44), సత్యనారాయణ (41), కే. రమేష్ (40), ఎస్. రమేష్ (42)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 1న అరెస్ట్ చేసిన నిందితులను మరుసటి రోజు కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఈ ఘటన ఆగస్టు 21న జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో చోటుచేసుకుంది. కాఫీ షాప్ నుంచి BMW కారులో బయటకు వస్తున్న వ్యక్తిని ట్రాన్స్‌జెండర్లుగా వేషం వేసుకున్న నలుగురు అడ్డుకున్నారు. బలవంతంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసి అతడి నుంచి రూ.5 వేలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై గుర్తుతెలియని వ్యక్తులపై ఎక్స్‌టార్షన్ కేసు నమోదైంది.
ఘటనకు సంబంధించిన వీడియోను అక్కడే ఉన్న ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు నెలకు పైగా దర్యాప్తు చేశారు. జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లోని 500 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. నిందితుల కదలికలను ట్రాక్ చేస్తూ జూబ్లీహిల్స్ నుంచి బోడుప్పల్ వరకు వారి ప్రయాణ మార్గాన్ని గుర్తించారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సహకారంతో నిందితులను అరెస్ట్ చేశారు.
ఇలాంటి ఘటనల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఎక్స్‌టార్షన్, బలవంతపు వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ గతంలో ప్రకటించారు. సెప్టెంబర్ 6న రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశాలు ఇస్తామని ఆయన వెల్లడించారు.ఇళ్లలో గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాల సందర్భంగా కొందరు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో ఓ గృహప్రవేశ కార్యక్రమంలో రూ.50 వేల డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చిన రెండు రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
అయితే ఈ చర్యలు మొత్తం ట్రాన్స్‌జెండర్ సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నవి కావని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా, HYDRAA వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎవరైనా బలవంతంగా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే 112కు ఫోన్ చేయాలని సీవీ ఆనంద్ ప్రజలకు సూచించారు. ఇలాంటి ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించేలా ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
Four Arrested for Allegedly Harassing BMW Owner for Money in Hyderabad Four men have been arrested for allegedly stopping a BMW owner on Jubilee Hills Road No. 45 and demanding ₹5,000. The incident, reported on August 21, was recorded by a YouTuber and later came to police attention. Police reportedly examined around 500 CCTV cameras over a month and traced the suspects to Boduppal. The accused were identified as Ramesh (40), Satyanarayana (41), Ramesh (42) and Yadagiri (44). Police said the accused allegedly dressed as transgender persons and stopped people on roads to demand money. #Hyderabad #JubileeHills #CrimeNews #HyderabadPolice #Police #BreakingNews #Telangana #Police #Crime #BMW #Telangananews - #ChanduAkkanapalli
— Chandu_Akkanapalli (@Chandu_report) October 2, 2026
