ప్రజలు రోడ్డుపైకి వచ్చి శాంతియుతంగా పోరాడితేనే తమ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోగలమని నటుడు, సోషల్ యాక్టివిస్ట్ ప్రకాశ్ రాజ్ అన్నారు. ఇది ఏ రాజకీయ పార్టీని గెలిపించేందుకు చేస్తున్న పోరాటం కాదని, ప్రజల మూల హక్కులను కాపాడుకోవడం కోసమేనని స్పష్టం చేశారు.
ఓట్లను కాపాడుకోవడం మాత్రమే ఈ పోరాటం ఉద్దేశం కాదని ప్రకాశ్ రాజ్ అన్నారు. ప్రజల ఓటు హక్కుతో పాటు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు గొంతెత్తాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత పరిస్థితులపై సమావేశాలు, చర్చలు నిర్వహించడం మాత్రమే సరిపోదని, ప్రజలు శాంతియుతంగా సత్యాగ్రహాల రూపంలో రోడ్డుపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
దేశవ్యాప్తంగా సీఈసీ, ఎన్నికల సంఘంలో అవకతవకలపై స్వల్పకాలిక పోరాటం కాదు.. సుదీర్ఘంగా కొనసాగాల్సిన ఉద్యమమని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. లాంగ్ ఫైట్‌కు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎవరినీ నమ్ముకుని లేదా ఏ రాజకీయ పార్టీపై ఆధారపడి ఈ పోరాటం చేయాల్సిన అవసరం లేదన్నారు.
ప్రజల మూల హక్కులపై దాడి జరుగుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని ప్రకాశ్ రాజ్ అన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలపై ప్రభావం పడే ప్రమాదాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. గతంలో జరిగిన సత్యాగ్రహాల తరహాలో శాంతియుత ప్రజా ఉద్యమం జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం SIR ఓటర్ల జాబితా సవరణపై ప్రకాశ్ రాజ్ ఇప్పటికే పలు సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కర్ణాటకలో పౌరసంఘాలతో కలిసి ఓటర్ల సమస్యలను సేకరించి, SIR ప్రక్రియపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.
