హైదరాబాద్‌సిటీ, వెలుగు: మోటార్ వెహికల్ అగ్రిగేటర్ విధానంలో పటిష్టమైన, డ్రైవర్లకు అనుకూలమైన నిబంధనలను చేర్చాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ), తెలంగాణ యాప్-బేస్డ్ డ్రైవర్స్ ఫోరమ్ (టీఏడీఎఫ్) కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు మంగళవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.
టీజీపీడబ్ల్యూయూ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్, ఇతర యూనియన్లు, మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు రూపొందించాలని, క్యాబ్‌లు, ఆటోల సరుకు రవాణాకు బేస్ ఫేర్, కిలోమీటర్‌కు, నిమిషానికి రేట్లతో సహా ప్రభుత్వం నోటిఫై చేసిన కనీస చార్జీలను తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఓలా, ఉబెర్, రాపిడో, ఇతర అగ్రిగేటర్ల ద్వారా ప్రైవేట్,వాణిజ్యేతర ద్విచక్ర, త్రిచక్ర,ఫోర్‌వీలర్ వాహనాల వాణిజ్య వినియోగంపై కఠినమైన నిషేధం విధించాలని కూడా వారు డిమాండ్ చేశారు.
