- హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో విద్యావేత్తలతో కీలక భేటీలు
- నేడు ఢిల్లీలో సీడబ్ల్యూసీ మీటింగ్ అనంతరం లండన్‌కు పయనం
- హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీల్లో విద్యావేత్తలతో భేటీలు
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల 20 నుంచి 30 వరకు పది రోజుల పాటు యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్‌ఏ)లో సీఎం విస్తృతంగా పర్యటించనున్నారు. తెలంగాణను అంతర్జాతీయ విద్య, నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) హబ్‌గా తీర్చిదిద్దడం, ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి వర్సిటీల ఆఫ్ షూర్ క్యాంపస్‌ల ఏర్పాటుకు, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం పర్యటన ఖరారైనట్టు సీఎంవో వెల్లడించింది. ఈ నెల 20న అర్ధరాత్రి 12.30 గంటలకు న్యూఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో సీఎం లండన్ బయలుదేరుతారు. అదే రోజు లండన్‌లో జరగనున్న ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కూతురు వివాహానికి హాజరవుతారు. 21న ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ సందర్శనతో పాటు ఎమిరేట్స్ స్టేడియంలో ఈపీఎల్ ఫుట్‌బాల్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
22న కేంబ్రిడ్జ్ బృందంతో కీలక భేటీ జరపనున్నారు. అదేరోజు యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్, లండన్ బిజినెస్ స్కూల్‌ను సందర్శించి ఉన్నత విద్యా సహకారంపై చర్చిస్తారు. అనంతరం 23న బ్రిటన్ నుంచి అమెరికాలోని బోస్టన్ చేరుకుంటారు. బోస్టన్ వేదికగా 24న ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం, ఎమ్‌ఐటీ క్యాంపస్‌లను సందర్శించి పలువురు విద్యావేత్తలతో భేటీ అవుతారు. 25న నార్త్-ఈస్టర్న్ క్యాంపస్‌ను సందర్శించడంతో పాటు వర్జీనియా టెక్ యూనివర్సిటీ ప్రతినిధుల బృందంతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. 26న న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (యూఎస్‌ఏ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. 29న న్యూయార్క్ నుంచి బయలుదేరి 30న హైదరాబాద్ చేరుకుంటారు. ఈ పర్యటనకు ముందే సీఎం రేవంత్ మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. బుధవారం ఢిల్లీలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశం, ఏఐసీసీ భేటీలో పాల్గొంటారు.
