ఓయూ, వెలుగు: విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలపై ప్రజా చర్చను లేవనెత్తడంలో జెన్ జీ ఉద్యమం కీలక పాత్ర పోషిస్తోందని ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు అన్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద జెన్ జీ మూవ్మెంట్ చర్చా గోష్టి పోస్టర్‌ను మంగళవారం ప్రొఫెసర్ వంశీధర్, ప్రొఫెసర్ సుశీల్ కుమార్, ప్రొఫెసర్ రమేశ్ఆజాద్ తో కలిసి ఆవిష్కరించారు. నీట్ వంటి పరీక్షలను పూర్తిగా కేంద్రీకృత విధానంలో నిర్వహించడం వల్ల గ్రామీణ పేద, సామాజికంగా వెనకబడిన వర్గాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జెన్జీ లాంటి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో విద్యార్థుల పాత్రపై చర్చించేందుకు అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 22న ఆర్ట్స్ కాలేజీ లోని రూమ్ నంబర్ 57లో మేధోపర చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ప్రజాస్వామ్యవాదులు, రీసెర్చ్ స్కాలర్సు, విద్యార్థులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
