టాలీవుడ్‌లో బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ల వివాదం తీవ్ర రూపం దాలుస్తోంది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను ప్రమోట్ చేశారన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా ఇవాళ ప్రముఖ నటి నిధి అగర్వాల్ హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
కేవలం నిధి అగర్వాల్ మాత్రమే కాకుండా, ఈ కేసులో మొత్తం 21 మంది ప్రముఖ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై ఈడీ కేసు నమోదు చేసింది. విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి వంటి అగ్ర నటులతో పాటు పలువురు టీవీ యాంకర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
నిషేధిత బెట్టింగ్ యాప్స్‌కు సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు ఇస్తూ.. యువతను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలపై సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగాఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద దర్యాప్తు చేపట్టింది. సెలబ్రిటీలు తీసుకున్న పారితోషికాలు, ఆర్థిక లావాదేవీలు,డిజిటల్ ట్రైల్స్‌పై అధికారులు తీవ్రమైన ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించిన ఈడీ త్వరలోనే మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
