- ఎకరాకు రూ.33 లక్షల నుంచి రూ.38 లక్షలు..
- మూడు గ్రామాల నిర్వాసితులకు త్వరలో రూ.26.12 కోట్లు జమ
- చౌటుప్పల్ నిర్వాసితులకు అత్యధికంగా రూ.1.20 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం
యాదాద్రి, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం కోసం భూములు కోల్పోతున్న యాదాద్రి జిల్లా నిర్వాసితులకు ఊరట లభించింది. తమకు పరిహారం పెంచాలన్న డిమాండ్‌ను ఆర్బిట్రేషన్ స్వాగతించింది. ఈ మేరకు ఆర్బిట్రేషన్ అధికారుల సూచనల మేరకు పరిహారం పెంచుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయం తీసుకుంది. దీంతో దత్తాయిపల్లి, ఇబ్రహీంపూర్, కోనాపురం నిర్వాసితులకు పెంచిన పరిహారం కింద రూ.26.12 కోట్లు త్వరలో ఖాతాల్లో జమ కానున్నాయి.
24 గ్రామాల్లో భూసేకరణ..
ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం యాదాద్రి జిల్లాలోని ఐదు మండలాల్లో 24 గ్రామాల మీదుగా 59.33 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఇందుకోసం 1,795 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. 2022లో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం అప్పటి రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు పరిహారం చెల్లించారు.
ఎకరాకు రూ.33 లక్షలకు పైగా..
పరిహారం తక్కువగా ఉందంటూ తుర్కపల్లి ‘కాలా’ పరిధిలోని దత్తాయిపల్లి, కోనాపురం, ఇబ్రహీంపూర్ నిర్వాసితులు ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించారు. అప్పటి రిజిస్ట్రేషన్ విలువతో పాటు ప్రస్తుతం సవరించిన విలువ, బహిరంగ మార్కెట్ ధరలను పరిశీలించిన ఆర్బిట్రేషన్.. పరిహారం పెంచాలని ఎన్హెచ్ఏఐకు సూచించింది. దీంతో దత్తాయిపల్లిలో ఎకరాకు రూ.38 లక్షలు, ఇబ్రహీంపూర్‌లో రూ.35 లక్షలు, కోనాపురంలో రూ.33 లక్షల చొప్పున పరిహారం ఖరారైంది. చౌటుప్పల్ నిర్వాసితులకు ఎకరాకు రూ.1.20 కోట్ల వరకు పెంచేందుకు కూడా ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది.
త్వరలో రూ.26.12 కోట్లు జమ..
ఆర్బిట్రేషన్ తరఫున కలెక్టర్ అనురాగ్ జయంతి ఎన్‌హెచ్‌ఏఐకి పెంచాల్సిన పరిహారం వివరాలను పంపించారు. సవరించిన రిజిస్ట్రేషన్ విలువ, మార్కెట్ ధరలను పరిశీలించిన ఎన్‌హెచ్‌ఏఐ పరిహారం పెంపునకు ఆమోదం తెలిపింది. దీంతో దత్తాయిపల్లి నిర్వాసితులకు రూ.13 కోట్లు, ఇబ్రహీంపూర్‌కు రూ.3.21 కోట్లు, కోనాపురానికి రూ.9.91 కోట్లు ఆర్‌టీజీఎస్ ద్వారా జమ చేయనున్నారు.
మల్లాపురం భూములపైకోర్టులో డిపాజిట్..
యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో భూసేకరణపై వివాదం నెలకొనడంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో అక్కడి భూములకు సంబంధించిన సుమారు రూ.25 కోట్ల పరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేశారు. భువనగిరి ‘కాలా’ పరిధిలోని రాయగిరి రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరించి ఆందోళనలు చేపట్టడంతో సర్వే నిలిచిపోయింది. వారిని ఒప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రైతులు అంగీకరిస్తే 2022 విలువ ప్రకారం పరిహారం చెల్లించి, ఆ తర్వాత ఆర్బిట్రేషన్ ద్వారా పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
