అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందాలనుకునే వారికి ట్రంప్ సర్కార్ ఒక కీలక ప్రకటన చేసింది. అమెరికా పౌరసత్వం వలస సేవల సంస్థ (USCIS) ప్రభుత్వ సాయంపై ఆధారపడే నిబంధనలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కొత్త రూల్స్ సెప్టెంబర్ 18, 2026 నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి.
సెప్టెంబర్ 18 నుంచి కొత్త రూల్స్ ఎందుకు?
అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ప్రభుత్వ సాయంపై ఆధారపడకుండా స్వయంసమృద్ధిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మార్పులు తెచ్చారు. దీనికోసం 2022 నాటి పబ్లిక్ ఛార్జ్ నిబంధనలను హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం రద్దు చేసింది. సెప్టెంబర్ 18 లేదా ఆ తర్వాత సమర్పించే అన్ని Form I-485 దరఖాస్తులకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. పాత ఫారమ్‌లను అధికారులు ఇకపై అంగీకరించరు.
ఏయే అంశాల ఆధారంగా పరిశీలిస్తారు?
గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులను అధికారులు మరింత కఠినంగా పరిశీలిస్తారు.
* దరఖాస్తుదారు ఆరోగ్య పరిస్థితి
* కుటుంబ నేపథ్యం, కుటుంబ సభ్యుల వివరాలు
* ఆస్తులు, ఆర్థిక వనరులు, సేవింగ్స్
* చదువు, నైపుణ్యాలు
ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసి, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి దరఖాస్తును అధికారులు పరిశీలిస్తారు. కేవలం నిరుద్యోగం, వయస్సు వంటి కారణాలతో దరఖాస్తులను తిరస్కరించరు.
ప్రభుత్వ సాయం తీసుకుంటే గ్రీన్ కార్డ్ వస్తుందా?
సెప్టెంబర్ 18, 2026 తర్వాత ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఆర్థిక సహాయాలు, సంక్షేమ పథకాలు అంటే ఫుడ్ స్టాంప్స్, హౌసింగ్ సాయం, కాలేజీ ఫీజు సాయం వంటివి పొందినా అది దరఖాస్తుపై నెగటివ్ ప్రభావం చూపుతుంది. సెప్టెంబర్ 18కి ముందు తీసుకున్న సహాయాలకు పాత నిబంధనలే వర్తిస్తాయి కానీ.. ఆ తేదీ తర్వాత తీసుకునే ప్రతి ప్రభుత్వ సాయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకుంటారు.
బాండ్ కట్టే అవకాశం..
ఎవరైనా గ్రీన్ కార్డ్ అప్లికెంట్ కేవలం పబ్లిక్ ఛార్జ్ కారణం వల్ల తిరస్కరించే స్థితిలో ఉంటే.. అధికారుల నిర్ణయం మేరకు వారికి పబ్లిక్ ఛార్జ్ బాండ్ కట్టే అవకాశం కల్పిస్తారు. ఈ బాండ్ కాలపరిమితిలో దరఖాస్తుదారు మళ్లీ ప్రభుత్వ సాయం పొందితే ఆ బాండ్ రద్దవుతుంది. కుటుంబ సభ్యులు, స్పాన్సర్‌లు ఆర్థికంగా అండగా నిలవగలరని నిరూపించడంలో విఫలమైతే గ్రీన్ కార్డ్ దరఖాస్తులు రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది.
ఎవరికి మినహాయింపు ఉంటుంది?
ఈ కొత్త పబ్లిక్ ఛార్జ్ నిబంధనలు ప్రధానంగా కుటుంబ ఆధారిత, ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులందరికీ వర్తిస్తాయి. అయితే శరణార్థులు, ఆశ్రయం పొందిన వారు, ఇప్పటికే గ్రీన్ కార్డ్ కలిగి ఉండి రెన్యువల్ చేసుకునే వారు, కొన్ని ప్రత్యేక మానవతా దృక్పథంతో వచ్చే వీసాదారులకు ఈ నిబంధనల నుంచి పూర్తి మినహాయింపు ఉంటుందని అమెరికా ప్రభుత్వం క్లారిటీగా వెల్లడించింది.
