విద్యార్థులు బాగా చదువుకోవాలి, మంచి స్థానంలో ఉండాలనే లక్ష్యంతోనే కాకా ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి వివేక్ స్పష్టం చేశారు. కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువత కోసం ప్రత్యేకంగా ఉచిత శిక్షణా కేంద్రం అందుబాటులోకి తెచ్చామన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఎస్సై అభ్యర్థుల సంక్షేమం కోసం తాను చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
కేవలం పోలీసు ఉద్యోగాలే కాకుండా... మారుతున్న కాలానికి అనుగుణంగా యువతకు గ్లోబల్ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు (ATC) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే మందమర్రి యువతకు జర్మనీ లాంగ్వేజ్ శిక్షణ ఇస్తూ విదేశీ ఉద్యోగ అవకాశాలకు బాటలు వేస్తున్నామన్నారు.
ఇక విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం... కిష్టంపేట డిగ్రీ కళాశాల అభివృద్ధికి కోటి యాభై లక్షలు కేటాయించడమే కాక, చెన్నూరు నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతోందన్నారు వివేక్. అంతేకాకుండా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏకంగా 50 వేల మంది ఉపాధ్యాయుల నియామకం చేపట్టిందని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా రూ.250 కోట్ల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. యువత ఈ అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకొని, తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నారు.
